నల్లగొండ ప్రతినిధి, జూన్ 21(నమస్తే తెలంగాణ) : భూముల విలువ పెంచడంతో రెవెన్యూ పరంగా విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతుందని, ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి తీసుకువచ్చినా అవినీతి ఏమాత్రం తగ్గలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. చిన్నచిన్న పనులకు కూడా కుంటిసాకులు చూపుతూ అధికారులు కొర్రీలు పెడుతుండటంతో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే విభాగంలో ఒకప్పుడు 700 జీతంలో ఉద్యోగంలో చేరిన డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు, బంగారం దొరుకడం అంటే అవినీతి ఏవిధంగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవాలని చెప్పారు.ప్రభుత్వం అనవసర ఖర్చులు తగ్గించాలని, అవసరం లేని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఇందులో అనేక విషయాలపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురకలంటించారు.
అసలే రాష్ట్ర ర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పథకాలపైనే దృష్టి సారించాలని హితవుపలికారు. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చే ఉచిత హామీలపై పునరాలోచన చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా చోట్ల ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీలకు తోడు కస్తూర్బా, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు ఉన్నాయని, అదనంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకుని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న చాలా డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులే లేరని చెప్తూనే ఒక్కో దానికి రూ.250 కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడం అనవసరమని చెప్పారు. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేయాలని సూచించారు. ఏ పార్టీ అయినా ఆచరణ సాధ్యమైన పథకాలపైనే హామీలు ఇవ్వాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉచిత హామీలు ఇవ్వడం మానుకోవాలని హితవుపలికారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అన్ని రాష్ర్టాలతో చర్చించి సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఎన్నికలు అంటేనే విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయడమనే చందంగా పరిస్థితి మారిపోయిందని గుత్తా వాపోయారు. ఎన్నికల్లో గెలువాలంటే భారీగా ఖర్చు చేస్తున్నారని, తర్వాత ఆ ఖర్చుల కోసం స్కామ్‌లకు తెరలేపుతున్నారని చెప్పారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టే టికెట్లు ఇస్తున్నాయని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.50 కోట్లు, ఎంపీగా చేయాలంటే రూ.100 కోట్లు ఖర్చు చేసే దమ్ము ఉండాల్సిన దుస్థితి దాపురించిందని వాపోయారు. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు టీడీపీ నుంచే డబ్బు అంశాలు తెరపైకి వచ్చాయని, ప్రస్తుత పరిస్థితి విచ్చలవిడిగా మారిందని చెప్పారు. అందుకే అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, రిటైర్డ్ ఐఆర్ఎస్, ఐఏఎస్‌ల లాంటి వాళ్లు పోటీ చేసి గెలుస్తున్నారని ఉదహరించారు. రాజకీయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించడంలో అన్ని పార్టీల పాత్ర ఉన్నదని, ఇట్లాంటి వాటిపై కఠిన చట్టాలు, శిక్షలు అవసరమని,అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే రాజకీయ అవినీతికి చెక్ పడాలని అభిప్రాయపడ్డారు. అధికార వ్యవస్థలో సైతం అవినీతిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ‘ఒకనాడు నేను సైతం నక్సలైట్ల బాధితుడినే.. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే వాళ్ల లాంటి వాళ్లు ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తున్నది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.