వరంగల్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రకృతిని చీల్చి కోటానుకోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి, వేలాది ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు విలవిల్లాడుతున్నాయి. బొగ్గు భీతావహంతో శిల్పరామం గజగజా వణికిపోతున్నది. రామప్ప చెరువు మధ్య ఉన్న ద్వీపంలో సాస్కీ (స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్-డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్) పథకంలో భాగంగా చేపట్టిన పనులు గడువులోగా పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రామప్ప చెరువు ద్వీపంలో జరుగుతున్న పని ప్రదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత నిషేధ ప్రాం తంగా మార్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. సాస్కీ స్కీమ్‌లో భాగంగా చేస్తున్న పనుల సందర్భంగా కాకతీయ శిల్పాలు విరిగిపడ్డాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

ఆ శిల లు తవ్వకాలవల్ల బయటపడ్డవి కాదని, ద్వీపం కొద్దిదూరంలో శిథిలావస్థకు చేరిన రామక్కగుడికి సంబంధించిన శిల్పాలు అయి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్ర స్తుతం కొనసాగుతున్న పనులకు కొద్దిదూరం లో విరిగిపడిన నంది విగ్రహం, పానవట్టం, పోగుపడిన శిల్పస్తంభాలు మట్టికుప్ప పక్కకు విసరివేయబడినట్టు ఉన్నాయి. ఈ ద్వీపంలో గుడి ఉన్న దాఖలాలు దేవాదాయ, పురావస్తు శాఖల రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.
2015 నుంచి 2021 దాకా కేసీఆర్ సర్కా ర్ చేసిన అవిరామ కృషి ఫలితంగా రామప్పగుడిని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తించింది. దీంతో రామప్పతోపాటు నల్లమలలోని సోమశిల ఆధ్యాత్మిక కేంద్రం సాస్కీ స్కీమ్ కింద ఎంపికయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు పలు అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. రామ ప్ప రీజియన్ సస్టేయినబుల్ టూరిజం సర్క్యూట్లో భాగంగా రామప్ప ద్వీపంలో రూ.13కోట్ల అంచనాలతో పనులు చేస్తున్నా రు.
30 అడుగుల ఎత్తయిన నటరాజ విగ్ర హం, ఫ్లోటింగ్ జెట్టీ అండ్ వాటర్ స్పోర్ట్స్, వి శ్రాంతి గదులు, ఆటస్థలం, బట్టర్ ఫ్లై గార్డెన్ తదితర పనులు సాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చేపట్టింది. పనుల నాణ్యత, పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసినవారి ఆధీనంలో ఉందని, వారికి మాత్రమే సైట్ విజిట్ చేసే అవకాశం ఉండటంతో రామప్ప చెరువు ద్వీపంలో ఏం జరుగుతున్నది ఎవరికీ అంతుబట్టని రహస్యంగా మారింది.