రామ్..ప్రేమకథా చిత్రాల్లో ఎంత చక్కగా ఒదిగిపోతాడో.. మాస్, యాక్షన్ కథల్లో అంతకు మించిన ఎనర్జీతో మెప్పిస్తాడు. ఆయన ఎంచుకునే కథల్లో కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంటుంది. రామ్ తొలిసారి పోలీస్ అధికారి పాత్రను పోషించిన చిత్రం ‘ది వారియర్’. లింగుస్వామి దర్శకత్వం వహించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో రామ్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
తొలిసారి ఐపీఎస్ పాత్రను పోషించారు. దర్శకుడు లింగుస్వామి కథ చెప్పినప్పుడు మీకు బాగా నచ్చిన అంశాలేమిటి?
పోలీస్ కథ చేద్దామని ముందే నిర్ణయం తీసుకున్నా. ఆ జోనర్లో మంచి కథ కోసం అన్వేషణలో ఉండగా..లింగుస్వామి ‘ది వారియర్’ సబ్జెక్ట్‌తో నన్ను కలిశారు. కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది. పోలీస్ అధికారుల జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో తాను ఈ కథ రాసుకున్నానని లింగుస్వామి చెప్పారు. ఆయన నరేషన్ ఇచ్చి వెళ్లిపోయిన వెంటనే..అదే రోజు సాయంత్రం పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. అంతలా ఈ కథ నన్ను ఎక్సైట్ చేసింది.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత కథల ఎంపికలో మీ ప్రాధాన్యతలు మారినట్లుగా కనిపిస్తున్నది?
కథల ఎంపికలో రొటీన్ పంథాను బ్రేక్ చేయాలని ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందే నిర్ణయించుకున్నా. అందుకే ఓ కొత్త మేకోవర్‌తో ఆ సినిమా చేశాను. భవిష్యత్తులో కూడా కథాంశాల ఎంపికలో కొత్తదనానికే ప్రాధాన్యతనిస్తాను.
షూటింగ్లో గాయపడినప్పుడు డాక్టర్ మీతో ‘జీవితం ముఖ్యమా? సినిమా ముఖ్యమా? అని అన్నారని చెప్పారు. ఆ టైమ్‌లో మీ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి?
స్పైనల్ కార్డ్ గాయం కాబట్టి సీరియస్‌గా అనిపించింది. ఎడమ చేయి కొన్ని రోజులు పనిచేయలేదు. మూడు నెలల పాటు ఖాళీగా ఉండటం కష్టంగా అనిపించింది. ఆ టైమ్‌లో డాక్టర్ అలా అడిగారేంటి అనుకున్నా. ఆయన దృష్టికోణంలో అది కరెక్టే. సినిమానే జీవితం అనుకునే నాకు ఆ ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్‌లా అనిపించింది.
దర్శకుడు లింగుస్వామికి గత కొంతకాలంగా సరైన సక్సెస్‌లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మీరు పెద్ద హిట్ కొట్టారు. ఏ నమ్మకంతో లింగుస్వామికి అవకాశమిచ్చారు?
దర్శకుల ఫామ్ గురించి నేనెప్పుడూ ఆలోచించను. అలా అయితే పూరి జగన్నాథ్‌గారితో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్, లింగుస్వామి దక్షిణాదిలో ఓ ట్రెండ్‌సెట్ చేసిన దర్శకులు. లింగుస్వామితో ఎప్పటి నుంచో సినిమా చేద్దామనుకుంటున్నా కానీ కథలు సెట్ కాలేదు. చివరకు ‘ది వారియర్’ రూపంలో అద్భుతమైన కథ కుదిరింది.
గత కొన్ని వారాలుగా ఇండస్ట్రీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్ని మీరెలా విశ్లేషిస్తారు?
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, సర్కారు వారి పాట చిత్రాల రూపంలో ఇండస్ట్రీకి భారీ విజయాలు దక్కాయి. కొన్ని సినిమాల్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారు. ‘ది వారియర్’ థియేటర్లోనే చూడాల్సిన సినిమా.
ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ దక్కుతున్నది..?
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో నా ఏడో సినిమా ఇది. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. బీజీఎమ్లతో సహా సీన్స్ గురించి వివరించి చెప్పారు. అంతలా కథను ఇష్టపడ్టాడు కాబట్టే పాటలకు మంచి బాణీలు ఇచ్చాడు. బుల్లెట్, విజిల్ సాంగ్స్ ఛార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.
ఈ సినిమాకు ‘ది వారియర్’ అని టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?
కరోనా టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్ అనే పదం బాగా పాపులర్ అయింది. కరోనాపై పోరులో డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు ముందుండి బాధ్యతలు నిర్వర్తించారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు ‘ది వారియర్’ అని టైటిల్ పెట్టాం.
కాలికి గాయమైనా షూటింగ్ చేశానని చెప్పారు..అంత రిస్క్ తీసుకోవడానికి కారణమేమిటి?
నేను కెమెరా ముందుకెళ్తే లెన్స్ కనిపించవు. సినిమా కోసం థియేటర్లకు వచ్చే పదికోట్ల మంది ప్రజలు కనిపిస్తారు. అంతమంది సినిమాను ఇష్టపడుతున్నారంటే వారికోసం వందశాతం అంకితభావంతో శ్రమించాలని అనుకుంటా.
మీ చిన్ననాటి స్కూల్ స్వీట్హార్ట్ గాసిప్ గురించి‘ఆమెవరో నాకే తెలియదు..నేనెప్పుడు స్కూల్‌కు వెళ్లానంటూ’ సరదాగా స్పందించారు. ఇలాంటి గాసిప్స్ విన్నప్పుడు మీ ఇంట్లోవాళ్లు ఏమంటారు?
సీక్రెట్ చైల్డ్‌హుడ్ గాళ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్నానంటు వార్తలు రాశారు. అది చూసి ఇంట్లో వాళ్లు కూడా నన్ను అనుమానంతో చూశారు(నవ్వుతూ). నా ఫ్రెండ్స్ కూడా ‘అసలు విషయమేంటి’ అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అందుకే నేను స్కూల్‌కు ఎప్పుడు వెళ్లానని వారందరికి సరదాగా సమాధానమిచ్చా.
బోయపాటి శ్రీనుతో మీరు చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది?
మా ఇద్దరి అభిరుచులకు తగిన కథ సిద్ధమైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నాం.