RGV Dangerous Movie | ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చేసిన దర్శకుల జాబితా తీసుకుంటే అందులో కచ్చితంగా ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మొదటి సినిమా శివతోనే ఇండియా మొత్తాన్ని షేక్ చేశాడు ఈయన. ఆ తర్వాత కూడా క్షణక్షణం, దయ్యం, రంగీలా, సర్కార్, సర్కార్ 2, కంపెనీ లాంటి ఎన్నో సినిమాలతో సంచలనాలు సృష్టించాడు. కానీ గత కొన్నేండ్లుగా ఆర్జీవీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమాలు రావడం లేవు. ఐస్ క్రీమ్, అడవి అంటూ ఏవేవో సినిమాలు చాలానే తీశాడు వర్మ. కానీ ఆ సినిమాలు అస్సలు ఆకట్టుకోలేకపోయాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా ఆయన తెరకెక్కించిన మరో సినిమా మా ఇష్టం ( డేంజరస్ ). అప్సర రాణి, నైనా గంగూలీ హీరోయిన్లుగా లెస్బియన్ కథతో ఈ సినిమా తెరకెక్కించాడు వర్మ. ఇండియాలో ఈ తరహా సబ్జెక్టుతో వచ్చిన మొదటి సినిమా ఇదే. పోస్టర్స్, ట్రైలర్స్‌లో కూడా ఇదే ప్రమోట్ చేశాడు వర్మ. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేశాడు. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం వర్మకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇలాంటి సాఫ్ట్ పోర్న్ సినిమాలు తాము థియేటర్స్‌లో విడుదల చేయలేమని చేతులెత్తేశారు.
అంతేకాదు మా ఇష్టం సినిమాపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. దాంతో ఈ వారం విడుదల కావాల్సిన మా ఇష్టం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా పోస్ట్ పోన్ విషయంపై వర్మ క్లారిటీ ఇచ్చాడు. మా ఇష్టం సినిమా విడుదల విషయంలో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా థియేటర్స్ నాన్ కో ఆపరేషన్ దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత మరో విడుదల తేదీ తెలియచేస్తాను అంటూ ఒక లేఖ విడుదల చేశాడు.