Ram Charan | సినిమా ప్రపంచంలో కథల ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక హీరో వద్ద మొదలైన కథ చివరికి ఇంకో హీరో చేతిలో పడి పెద్ద హిట్ అవడం సర్వసాధారణం. హీరోలు ఒక్కోసారి కథను ఎంపిక చేసేటప్పుడు తమ ఇమేజ్, అభిమానుల రియాక్షన్, బిజినెస్ కాలిక్యులేషన్స్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందుకే చాలా మంచి కథలు చేతులు మారి చివరికి ఎవరికో సక్సెస్‌ని అందిస్తాయి. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇద్దరూ వదిలేసిన ఒక కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు “నాయక్”.
పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్ని ఉన్నా, ఆయన వదిలేసిన సినిమాల లిస్ట్ కూడా అంతే పెద్దది. ఇడియట్ , అతడు, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం , పోకిరి , అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి వంటి హిట్లు మొదట పవన్ కళ్యాణ్ చెంతకు వచ్చాయి. అలాగే ప్రభాస్ కూడా ఒక్కడు , దిల్ ,ఆర్య , బృందావనం , డాన్ శీను , ఊసరవెల్లి వంటి చిత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించాడు. అయితే, వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన “నాయక్” కథ ముందుగా ప్రభాస్‌కి వినిపించారట. అప్పటికి ఆయన మిర్చి సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌ను వదిలేశారట. అంతకుముందే అదే కథ పవన్ కళ్యాణ్‌కి కూడా చెప్పారట. కానీ ఆయన కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.
తర్వాత ఆ స్క్రిప్ట్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లింది. వినాయక్‌తో కలసి రామ్ చరణ్ అంగీకరించడంతో “నాయక్” సినిమా రూపుదిద్దుకుంది. ద్విపాత్రాభినయం, మాస్ ఎంటర్టైన్మెంట్, దేవిశ్రీ సంగీతం అన్ని కలిసి రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అలా ఇద్దరు స్టార్ హీరోలు వద్దన్న కథ, చివరికి రామ్ చరణ్‌కు ఘన విజయాన్ని సాధించడం విశేషం. “నాయక్” చరణ్ కెరీర్‌లోని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చరణ్‌కి పెద్ద హిట్ ఇస్తుందని భావిస్తున్నారు.