Baahubali The Epic | తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి – ది బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్ సినిమాలు అప్పట్లో దుమ్ము రేపిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మళ్లీ విడుదల చేశారు. రీ రిలీజ్‌కి కూడా సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ టికెటింగ్స్లో జోష్ స్పష్టంగా కనిపించింది. థియేటర్లలో మళ్లీ బాహుబలి మేనియా అలజడి సృష్టించింది. ప్రమోషన్స్ లేకపోయినా, దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమే ఓపెనింగ్స్‌కు ప్రధాన కారణమైంది.
అయితే, ప్రారంభ అంచనాల ప్రకారం ఈ చిత్రం రీ రిలీజ్‌తో 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావించినా, ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మొత్తం 45 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. అంచనాలు అందుకోకపోయినా, రీ రిలీజ్‌లలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.ఇప్పటివరకు సనమ్ తేరీ కసం (₹42 కోట్లు), తుంబాడ్ (₹38 కోట్లు), ఘిల్లి (₹32 కోట్లు), ఏ జవానీ హై దివానీ (₹26 కోట్లు) రీ రిలీజ్‌లలో టాప్‌లో ఉన్నాయి. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ వాటన్నింటినీ దాటించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతుండటంతో, 50 కోట్ల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రమోషన్లు పెంచి, వేరే భాషల్లో కూడా హైప్ క్రియేట్ చేసి ఉంటే, వసూళ్లు మరింత పెరిగేవని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. 100 కోట్ల టార్గెట్ మిస్ అయినా, రీ రిలీజ్లో టాప్ పొజిషన్ దక్కించుకున్నందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాహుబలి మళ్లీ నిరూపించింది, కాలం గడిచినా లెజెండ్ ఎప్పుడూ కనుమరుగు కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ‘బాహుబలి’ కథను యానిమేషన్ రూపంలో తీసుకువస్తున్నారు. ఇప్పటికే రీ రిలీజ్లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్‌ను కూడా చూపించారు. అయితే తాజాగా దీన్ని విడుదల చేశారు. చూస్తుంటే సినిమా కథ కొత్తగా, ఆధ్యాత్మిక అంశాలతో ఉండబోతుందని తెలుస్తోంది.