ప్రస్తుతం అగ్ర కథానాయికలందరూ కథాంశాల ఎంపికలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. సామాజిక, కుటుంబ కట్టుబాట్ల వల్ల బాహాటంగా చర్చించడానికి ఇష్టపడని బోల్డ్ ఇతివృత్తాల్లో కూడా భాగమవుతూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. తాజా చిత్రం ‘ఛత్రీవాలీ’లో రకుల్‌ప్రీత్‌సింగ్ కండోమ్ టెస్టర్‌గా సరికొత్త పాత్రలో దర్శనమివ్వబోతున్నది. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయిన నిరుద్యోగ మహిళ ప్రొఫెషనల్ కండోమ్ టెస్టర్‌గా ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. అయితే సాంఘికపరమైన ఇబ్బందుల వల్ల తన ఉద్యోగం గురించి ఎవరితో చెప్పుకోలేకపోతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక కోణంలో ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు. వ్యంగ్యం, హాస్యం మేళవించిన ఫ్యామిలీ డ్రామా ఇదని దర్శకుడు తేజాస్ ప్రభాస్ డీయోస్కర్ తెలిపారు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది రకుల్‌ప్రీత్‌సింగ్. ‘సీజన్‌తో సంబంధం లేకుండా వర్షం ఎప్పుడైనా పడొచ్చు. మీ గొడుగుల్ని సిద్ధం చేసుకొని ఉంచుకోండి’ అంటూ ఈ ఫస్ట్‌లుక్ గురించి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన తెలుగు చిత్రం ‘కొండపొలం’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే.