Bombay Movie | దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి సినిమా ఇప్పుడు వచ్చి ఉంటే థియేటర్లు తగలబడిపోయేవని తెలిపాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మేనన్. బొంబాయి, మెరుపు కలలు, విడుదల, కడలి తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ పనిచేసిన ఇతడు తాజాగా ఒక యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలో పాల్గోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
బాంబే (తెలుగులో బొంబాయి) లాంటి సినిమాను ఇప్పుడు తెరకెక్కించలేము. అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు మతపరమైన ఘర్షణలు ఉన్న అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. మతం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. జనాలు మతం పేరు చెప్పగానే సహనం కోల్పోతున్నారు. అందుకే బాంబే సినిమాను ఇప్పుడు విడుదల చేస్తే.. ఎన్ని థియేటర్లు తగలబడిపోతాయో లెక్క పెట్టలేం. గత 30 ఏండ్ల నుంచి ప్రజలలో సహనం నశిస్తుందంటూ రాజీవ్ మేనన్ చెప్పుకోచ్చాడు.
1992లో జరిగిన బాబ్రీ మసీద్ ఘటన అనంతరం దేశంలో మత ఘర్షణలు చేలరేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాంబేలోని పలు ప్రాంతాల్లో హిందు ముస్లింల మధ్య గొడవలు చేలరేగాయి. ఈ ఘర్షణల వలన దాదాపు 2000 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన మణిరత్నం(Mani Ratnam)ను చాలా కదిలించింది. దీంతో ఈ ఘటనపై మువీ తీయాలని బాంబే సినిమాను అనౌన్స్ చేశాడు. ముందుగా హీరోగా విక్రమ్‌ని అనుకున్న ఆ తర్వాత అనుకొని కారణాలతో అరవింద్ స్వామి హీరోగా నటించాడు. మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. ముస్లిం అయిన నాజర్ ఇందులో హిందువు పాత్రలో కనిపించగా.. సీనియర్ నటుడు హిందువు అయిన కిట్టు అబ్దుల్ బషిర్ పాత్రలో నటించాడు. తెలుగు నటుడు రాళ్లపల్లి ఇందులో కీలక పాత్రలో మెరిశాడు. 1995లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, విమర్శకులను సైతం మెప్పించింది. ఈ మూవీలోని పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.