Rajeev Kanakala | టాలీవుడ్లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కనకాల తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రాజీవ్ కనకాల.. ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ స్కూల్ కార్యక్రమానికి హాజరుకావడం ఆయనను అనుకోని వివాదంలోకి నెట్టింది. హైదరాబాద్‌లోని ‘వైబ్రాంట్’ అనే స్కూల్ నిర్వహించిన కార్యక్రమానికి రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడటంతో పాటు, మంచి మార్కులు సాధించిన పిల్లలకు బహుమతులు అందజేశారు. అయితే ఈ కార్యక్రమంపై నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని ఆరోపించిన ఆ సంస్థ ప్రతినిధులు.. అలాంటి స్కూల్ కార్యక్రమానికి రాజీవ్ కనకాల హాజరుకావడం, పరోక్షంగా ప్రమోట్ చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో వివాదంపై స్పందించిన రాజీవ్ కనకాల ఓ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. “హైదరాబాద్‌లోని వైబ్రాంట్ స్కూల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అక్కడ పేరెంట్స్‌తో ఇంటరాక్షన్ జరిగింది. మంచి మార్కులు సాధించిన పిల్లలకు నా చేతుల మీదుగా చిన్నపాటి బహుమతులు, సత్కారాలు నిర్వహించారు. ఒక సెలబ్రిటీగా, మీలో ఒకడిగా అక్కడికి వెళ్లడం నాకు సంతోషంగా అనిపించింది” అని తెలిపారు.
అలాగే ఆ స్కూల్‌పై ఉన్న ఆరోపణల గురించి తనకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని రాజీవ్ స్పష్టం చేశారు. “నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి సంస్థ ప్రతినిధులు అక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు. నిజంగా ఆ స్కూల్ గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు. తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుని, ఆ తర్వాతే తమ పిల్లలను జాయిన్ చేయాలి” అని సూచించారు. ఇక స్కూల్ ప్రమోషన్ల కోసం తన ఫోటోలు, వీడియోలు ఉపయోగించవద్దని నిర్వాహకులకు ఇప్పటికే చెప్పినట్లు కూడా రాజీవ్ కనకాల వెల్లడించారు. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.