గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా సీజన్లో అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించింది. వేలంలో యువ ఆటగాళ్లపై భారీగా ఖర్చు పెట్టిన ఫ్రాంచైజీకి మొదటి మ్యాచ్‌లో షాక్ తగిలింది. రషీద్‌ఖాన్ లేని బౌలింగ్ దాడిని రాజస్థాన్ ప్లేయర్లు ఆటాడుకోగా.. భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే రైజర్స్ ఓటమిని ఆహ్వానించింది! ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా.. బంతితో విఫలమైన వాషింగ్టన్ సుందర్.. ఆఖర్లో బ్యాట్‌తో అభిమానులను అలరించాడు!
పుణే: అంచనాల్లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. తమ మొదటి మ్యాచ్‌లో నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్ సేన ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మైర్ (13 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఒకటికి నాలుగు నోబాల్స్ వేసిన మన బౌలర్లు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. కొండంత లక్ష్య ఛేదనలో కనీసం ప్రయత్నించకుండానే పరాజయాన్ని ఆహ్వానించింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టును ముందుండి నడిపిస్తాడనుకున్న కేన్ విలియమ్సన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. పది కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసుకున్న నికోలస్ పూరన్ (0) సున్నా చుట్టాడు. మార్క్మ్ (41 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించగా.. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శాంసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా బుధవారం బెంగళూరుతో కోల్‌కతా తలపడనుంది.
ఏ దశలోనూ..
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. టాపార్డర్ బాధ్యతలు మోస్తున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో ఓవర్లోనే ఔట్ కాగా.. కాసేపటికే రాహుల్ త్రిపాఠి (0) అతడిని అనుసరించాడు. విపరీతమైన అంచనాలతో బరిలోకి దిగిన నికోలస్ పూరన్ ఆకట్టుకోలేకపోగా.. భారీ ధర పెట్టి తిరిగి దక్కించుకున్న ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ (9) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అబ్దుల్ సమద్ (4) విఫలం కాగా.. షెఫర్డ్ (24; 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా మార్క్మ్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఆఖర్లో అతడికి సుందర్ తోడవడంతో సన్‌రైజర్స్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 16 ఓవర్లు ముగిసేసరికి 81/6తో ఉన్న హైదరాబాద్ చివర్లో ధాటిగా ఆడింది. కౌల్టర్‌నైల్ వేసిన 17వ ఓవర్లో సుందర్ వరుసగా 6,4,4,2,4,4 రాబట్టడంతో 24 పరుగులు వచ్చాయి. ప్రసిద్ధ్ ఓవర్లో మార్కరమ్ 6,4 బాదగా.. బౌల్ట్‌కు సుందర్ అదే శిక్ష వేశాడు. వీరిద్దరి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది.
కొంపముంచిన నోబాల్స్..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి బట్లర్ స్లిప్‌లో క్యాచ్ ఔటైనా.. ఆ బంతి నోబాల్ కావడంతో బతికి పోయాడు. తదుపరి ఓవర్లో భువనేశ్వర్ మరో నోబాల్ వేయగా.. ఉమ్రాన్ మాలిక్ తొలి ఓవర్లో బట్లర్ వీర బాదుడు బాదాడు. 2 ఫోర్లు, 2 సిక్సర్లతో విజృంభించాడు. అందులో ఒకటి నోబాల్ ఉండటం గమనార్హం. వాషింగ్టన్ సుందర్ నోబాల్‌తో బౌలింగ్ ప్రారంభించగా.. అతడి తొలి ఓవర్లో బట్లర్, యశస్వీ కలిసి 18 పరుగులు పిండుకున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఎట్టకేలకు షెఫర్డ్ రైజర్స్‌కు తొలి వికెట్ అందించగా.. సంజూ శాంసన్ రాకతో హైదరాబాద్ పరిస్థితి మరింత దిగజారింది. అభిషేక్ వర్మ ఓవర్లో 4,6 కొట్టిన శాంసన్.. సుందర్‌కు అదే శిక్ష వేశాడు. ఈ క్రమంలో బట్లర్ ఔటైనా.. దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించాడు. షెఫర్డ్ ఓవర్లో పడిక్కల్ 4,6,4తో సత్తాచాటితే.. సుందర్ ఓవర్లో శాంసన్ రెండు భారీ సిక్సర్లు అరుసుకున్నాడు. ఇక ఆఖర్లో క్రీజులోకి వచ్చిన పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో రాజస్థాన్ కొండంత స్కోరు చేసింది.
స్కోరు బోర్డు
రాజస్థాన్: బట్లర్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ 35, యశస్వీ (సి) మార్క్మ్ (బి) షెఫర్డ్ 20, శాంసన్ (సి) సమద్ (బి) భువనేశ్వర్ 55, పడిక్కల్ (బి) ఉమ్రాన్ 41, హెట్‌మైర్ (బి) నటరాజన్ 32, పరాగ్ (సి) పూరన్ (బి) నటరాజన్ 12, కౌల్టర్‌నైట్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 210/6. వికెట్ల పతనం: 1-58, 2-75, 3-148, 4-163, 5-207, 6-210, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-1, షెఫర్డ్ 4-0-33-1, ఉమ్రాన్ 4-0-39-2, సుందర్ 3-0-47-0, నటరాజన్ 4-0-43-2, అభిషేక్ 1-0-15-0.
హైదరాబాద్: విలియమ్సన్ (సి) పడిక్కల్ (బి) ప్రసిద్ధ్ 2, అభిషేక్ (సి) హెట్‌మైర్ (బి) చాహల్ 9, రాహుల్ త్రిపాఠి (సి) శాంసన్ (బి) ప్రసిద్ధ్ 0, పూరన్ (ఎల్బీ) బౌల్ట్ 0, మార్క్మ్ (నాటౌట్) 57, సమద్ (సి) పరాగ్ (బి) చాహల్ 4, షెఫర్డ్ (బి) చాహల్ 24, సుందర్ (సి) హెట్‌మైర్ (బి) బౌల్ట్ 40, భువనేశ్వర్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 149/7. వికెట్ల పతనం: 1-3, 2-7, 3-9, 4-29, 5-37, 6-78, 7-133, బౌలింగ్: బౌల్ట్ 4-1-23-2, ప్రసిద్ధ్ 4-1-16-2, కౌల్టర్‌నైల్ 3-0-48-0, అశ్విన్ 4-0-21-0, చాహల్ 4-0-23-3, పరాగ్ 1-0-14-0.