సూరత్: సీనియర్ మహిళల టీ20 ట్రోఫీని రైల్వేస్ చేజిక్కించుకుంది. సమిష్టి ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. సూరత్ వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో స్నేహ్ రాణా బృందం పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 160/4 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మందన (56 బంతుల్లో 84) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. స్వాగతిక మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేదనలో హేమలత (65), సబ్బినేని మేఘన (52) బ్యాట్ ఝుళిపించడంతో మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే రైల్వేస్ లక్ష్యం పూర్తి చేసింది. మహారాష్ట్ర తరఫున మాయ సొనవానె రెండు వికెట్లు పడగొట్టింది.