హిస్సార్: జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) పసిడి పతకం కైవసం చేసుకుంది. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన నిఖత్.. బుధవారం జరిగిన తుదిపోరులో 4-1తో మీనాక్షి (హర్యానా)పై విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో చాంపియన్షిప్లో ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు అందుకున్న నిఖత్.. ప్రపంచ చాంపియన్షిప్నకు అర్హత సాధించింది. ఈ ఏడాది చివర్లో టర్కీ వేదికగా జరుగనున్న మెగాటోర్నీ 52 కేజీల విభాగంలో భారత్ నుంచి నిఖత్ బరిలోకి దిగనుంది. ఇతర విభాగాల్లో నీతు (48 కేజీలు), అనామిక (50 కేజీలు), శిక్ష (54 కేజీలు), సోనియా (57 కేజీలు), మీనా రాణి (60 కేజీలు), పర్విన్ (63 కేజీలు), అంజలి (66 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), నందినీ (ప్లస్ 81 కేజీలు) స్వర్ణ పతకాలు చేజిక్కించుకున్నారు.