సిరిసిల్ల టౌన్, జూన్19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పానీపూరీ తయారీ కేంద్రాలపై మున్సిపల్, ఫుడ్ సేప్టీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ పట్టణం, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో పానీపూరి తయారీ, పరిశుభ్రత ప్రమాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖాదీర్పాషా మాట్లాడుతూ.. పలు తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన పానీపూరీలు, ఫంగస్ పట్టిన ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పరిశుభ్రత, ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల నిల్వ, తయారీ, విక్రయాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత ప్రధాన లక్ష్యమని, ఆహార భద్రత ప్రమాణాల అమలులో రాజీపడమని స్పష్టం చేశారు. నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఇక్కడ ఫుడ్ సేప్టీ అధికారి అనూష, తదితరులు పాల్గొన్నారు.