న్యూఢిల్లీ, మార్చి 15: కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని గాంధీలు వేరొకరికి బదిలీ చేయాలని సీనియర్ నేత కపిల్ సిబల్ తేల్చిచెప్పారు. అధ్యక్ష పదవిలో లేనప్పటికీ, రాహుల్ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు. సిబల్ వ్యాఖ్యలకు మరోనేత సందీప్ దీక్షిత్ మద్దతు పలికారు. అయితే, పార్టీపై విమర్శలను సోనియా విధేయులు తిప్పికొట్టారు. ఎంపీ సీట్లు కావాలనుకొంటే బీజేపీలో చేరొచ్చని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం ముదిరిపాకాన పడినట్లయింది.
స్వచ్ఛందంగా అప్పగించాలి
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకపోయినప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్ణయాలన్నీ ఆయనే తీసుకొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనను విశ్లేషించిన తర్వాతనైనా నాయకత్వ మార్పునకు ‘గాంధీలు’ నడుం బిగించాలని కోరారు. కాంగ్రెస్ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. గాంధీలు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు ఈ విషయాన్ని వారికి చెప్పలేరని, అందుకే స్వచ్ఛందంగా వాళ్లే నాయకత్వ పగ్గాలను వేరొకరికి అప్పగించాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని కొనసాగించడంపై పార్టీ కార్యకర్తలు కొందరు సంతోషంగా లేరన్నారు.
ఈ మేరకు జాతీయపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. చరణ్‌జీత్ సింగ్ చన్నీని పంజాబ్ సీఎంగా రాహుల్ ప్రకటించడాన్ని సిబల్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. అధ్యక్ష హోదాలో లేనప్పటికీ, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకొంటున్నారని మండిపడ్డారు. పరోక్షంగా పార్టీ నిర్ణయాలన్నీ రాహులే తీసుకొంటున్నప్పుడు.. కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ చేపట్టాలని ఆయన్ని కొందరు కోరుతుండటం హాస్యాస్పదమన్నారు. తన చివరి శ్వాస వరకూ అందరి కాంగ్రెస్ (సబ్కీ కాంగ్రెస్) కోసం పోరాడుతానన్న సిబల్.. కుటుంబ కాంగ్రెస్ (ఘర్కీ కాంగ్రెస్)కు తాను వ్యతిరేకమన్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లందరినీ ఏకంచేయడమే ‘సబ్కీ కాంగ్రెస్’ ఉద్దేశమని పేర్కొన్నారు. సిబల్ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించలేదు.
పదవుల కోసమే
పార్టీ నాయకత్వంపై సిబల్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ క్రియాశీలంగా లేదని విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ, అధినాయకత్వంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. కొందరు పదవుల కోసమే ఎక్కువగా తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు.
నేడు ‘జీ-23’ నేతల భేటీ
కాంగ్రెస్ అధినాయకత్వంపై అసమ్మతి స్వరం పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలో ప్రక్షాళన అవసరాన్ని నొక్కిచెప్పిన ‘జీ-23’ నేతలు బుధవారం భేటీ కానున్నారు. సీనియర్ నేత కపిల్ సిబల్ నివాసంలో ఈ సమావేశం జరుగనున్నది. జీ-23’లో సభ్యులతో పాటు పార్టీలో మార్పులను కోరుకొంటున్న ఇతర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తున్నది.
ఐదుగురిపై వేటు
ఇటీవల జరిగిన ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఫలితాలను చవిచూసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చీఫ్‌లను పదవులకు రాజీనామా చేయాల్సిందిగా కోరారు. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు.
అలా అయితే బీజేపీలో చేరండి
కాంగ్రెస్ అధినాయకత్వం, రాహుల్‌పై సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు. ‘గాంధీలను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి కాంగ్రెస్‌ను సమూలంగా నిర్వీర్యం చేయాలన్నదే బీజేపీ, ఆరెస్సెస్ ప్రధాన లక్ష్యం. ఈ విషయం సిబల్‌కు కూడా తెలుసు. అయినప్పటికీ, సిబల్ బీజేపీ, ఆరెస్సెస్ గళాన్ని ఎందుకు వినిపిస్తున్నారో అర్థంకావడం లేదు’ అని కాంగ్రెస్ లోక్‌సభ విప్ మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు. నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేయడాన్ని మానుకొని, కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సిబల్ ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా హితవు పలికారు. సిబల్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేలా ఉన్నాయని, రాజ్యసభ సీటు కావాలనుకొంటే బీజేపీలో చేరొచ్చని అధీర్ రంజన్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బాధ్యతలు సోనియా చేతుల్లో ఉండటమే శ్రేయస్కరమని నేత వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. సోనియాకు మద్దతు ఇవ్వకుంటే తమకు నమ్మకద్రోహం చేసుకొన్నట్లేనని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.