e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News సమ్‌థింగ్‌ స్పెషల్‌

సమ్‌థింగ్‌ స్పెషల్‌

  • ఏరి కోరి స్పోర్టింగ్‌ పిచ్‌ తయారు చేయించిన ద్రవిడ్‌
  • గ్రౌండ్స్‌మెన్‌కు సొంత డబ్బుల నుంచి రూ.35 వేలు

కాన్పూర్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అరంగేట్ర ఆటగాళ్లకు క్రికెట్‌ దిగ్గజాలతో భారత క్యాప్‌లు అందించిన ‘ది వాల్‌’.. ఈసారి మరో అడుగు ముందుకేసి కాన్పూర్‌ గ్రౌండ్స్‌మెన్‌కు రూ.35 వేలు ఇచ్చి స్పోర్టింగ్‌ వికెట్‌ తయారు చేయించాడు. దశాబ్ద కాలంగా భారత గడ్డపై టెస్టుల్లో స్పిన్నర్లే రాజ్యమేలుతున్నారు. చివరి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే.. పర్యాటక జట్టు ఓడటం ఖాయమనే అపవాదు ఉండేది. దాన్ని చెరిపేయాలని భావించిన ద్రవిడ్‌.. కాన్పూర్‌ టెస్టుకు ముందు క్యూరేటర్‌ శివకుమార్‌ బృందానికి తన సొంత డబ్బు నుంచి రూ.35 వేలు ఇచ్చి మంచి స్పోర్టింగ్‌ వికెట్‌ తయారు చేయించాడు. దీని వల్లే భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు పూర్తి ఆట సాగినా.. ఫలితం తేలలేదు. ఇటీవలి కాలంలో భారత గడ్డపై ఎక్కువ టెస్టులు మూడు రోజుల్లోనే ముగుస్తున్న నేపథ్యంలో.. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ద్రవిడ్‌ ఈ పని చేశాడు. భారత కోచ్‌.. గ్రౌండ్స్‌మెన్‌కు డబ్బులు ఇచ్చిన విషయాన్ని సోమవారం ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం ధ్రువీకరించింది. ‘ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం. కాన్పూర్‌ టెస్టుకు ముందు గ్రౌండ్స్‌మెన్‌కు రాహుల్‌ ద్రవిడ్‌ రూ.35 వేలు సొంత డబ్బు ఇచ్చి పిచ్‌ సిద్ధం చేయించారు’ అని పేర్కొంది.

క్రికెట్‌ ఆడే సమయంలో తన వ్యక్తిత్వంతో జెంటిల్మెన్‌ గేమ్‌కు వన్నె తెచ్చిన ద్రవిడ్‌.. కోచ్‌గా కూడా అదే స్ఫూర్తి కొనసాగించడం అభినందనీయం. సొంతగడ్డపై ఆడిన టెస్టుల్లో టీమ్‌ఇండియా టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ సొంతమైనట్లే అనే ముద్ర ఉండేది. మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరు చేయడం ఆనక.. ప్రత్యర్థిని స్పిన్‌ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేయడం గత కొన్నాళ్లుగా చూస్తూ వస్తున్నాం. అందుకు భిన్నంగా కాన్పూర్‌ పిచ్‌పై నిలదొక్కుకుంటే బ్యాటింగ్‌ చేయడం పెద్ద కష్టం కాదని శ్రేయస్‌, శుభ్‌మన్‌ గిల్‌, టామ్‌ లాథమ్‌, విల్‌ యంగ్‌ నిరూపిస్తే.. పేసర్లకు ఏమాత్రం సహకారం ఉండదనుకున్న చోట టిమ్‌ సౌథీ, కైల్‌ జెమీసన్‌ సత్తాచాటారు. వచ్చీ రావడంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ద్రవిడ్‌.. ఇక ముందు సొంతగడ్డపై కూడా పేస్‌ పిచ్‌లు ఎదురుకావొచ్చని భారత ఆటగాళ్లకు చెప్పకనే చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ‘భారత పిచ్‌లపై ఐదో రోజు స్పిన్నర్లకు సహకారం లభించడం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా కాన్పూర్‌ పిచ్‌ నిర్జీవంగా కనిపించింది. గతంలో మాదిరిగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌లు ఎక్కువ కనిపించలేదు. మంచి బంతులకు మాత్రమే వికెట్లు దక్కాయి. చివరి సెషన్‌లో మనవాళ్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు’ అని అన్నాడు.

- Advertisement -

అప్పుడలా.. ఇప్పుడిలా..
ఈ ఏడాది ఆరంభంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు జో రూట్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లిష్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్జీవమైన చెపాక్‌ పిచ్‌పై రూట్‌ ద్విశతకంతో చెలరేగితే.. మిగిలినవాళ్లు కూడా తలో చేయి వేయడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కొండంత స్కోరు చేసింది. బదులుగా టీమ్‌ఇండియా దీటైన జవాబివ్వడంలో విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్కోరు చేసిన ఇంగ్లిష్‌ జట్టు.. భారత్‌ ముందు 420 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది! ఛేదనలో విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ మినహా తక్కిన వాళ్లంతా విఫలమవడంతో టీమ్‌ఇండియా 227 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన భారత్‌.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పూర్తి స్పిన్‌ పిచ్‌లు సిద్ధం చేసి ఇంగ్లండ్‌కు మరో అవకాశం ఇవ్వకుండా 3-1తో సిరీస్‌ చేజిక్కించుకుంది. ఆ మూడు మ్యాచ్‌ల్లో 60 వికెట్లకు గానూ 54 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు అయితే కేవలం రెండు రోజుల్లోనే ముగియడం కొసమెరుపు!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement