సూర్యాపేట సిటీ, జనవరి 4 : సూర్యాపేటలోని వైద్య కళాశాల హాస్టల్లో ర్యాగింగ్‌కు పాల్పడ్డ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల ఒకటిన పలువురు సీనియర్లు ఫస్టియర్ విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి దుస్తులు విప్పించి, మోకాళ్లపై కూర్చోబెట్టి పిడిగుద్దులు కురిపించారు. అసభ్య పదజాలంతో దూషించారు. మద్యం తాగుతూ చిత్రహింసలకు గురిచేసి ట్రిమ్మర్‌తో గుండు గీయించేందుకు ప్రయత్నించారు. సదరు విద్యార్థి తప్పించుకొని స్నేహితుడి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మహేందర్, షణ్ముఖ, రంజిత్సాయి, సుజిత్, హరీశ్, శ్రావణ్లను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ శారద తెలిపారు. దాంతోపాటు కళాశాల హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.