నందిగామ, నవంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామానికి అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. సర్పంచ్ నీలమ్మ గ్రామాభివృద్ధికి పక్క ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టుయార్డు, నర్సరీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటికీ మిషన్‌భగీరథ నీరు, విద్యుత్ దీపాలు వంటి అనేక మౌలిక వసతులు కల్పించారు.
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
బుగ్గోనిగూడ గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉండగా, 210 ఇండ్లు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పెరిగిన పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం, శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడం, పురాతన బావులను పూడ్చివేయడం వంటి పనులు చేశారు. రూ.4లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.7.83లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు, రూ.12.6లక్షలతో వైకుంఠధామం, రూ.1.73లక్షలతో పల్లె ప్రగతి, రూ.1.68లక్షలతో కంపోస్ట్‌యార్డు, రూ.40వేలతో సీసీ రోడ్లు, రూ.46వేలతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో ఎల్ఈడీ వెలుగులు జిగేల్మంటున్నాయి. ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి ఎరువుగా మార్చి పంట పొలాలు, చెట్లకు చల్లుతున్నారు. ఇలా పల్లె ప్రగతి కార్యక్రమంతో అనేక అభివృద్ధి పనులతో బుగ్గోనిగూడ గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం
హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, గ్రామంలోని ఖాళీ స్థలాల్లో మొత్తం కలిపి 5844 మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో 3805 మొక్కలు, నర్సరీలో 12,000 మొక్కలు, వైకుంఠధామంలో 1000 మొక్కలను నాటారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మొక్కల సంరక్షణకు డ్రిప్పు ఏర్పాటు చేసి నాటిన ప్రతి మొక్కను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరుగడంతో గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
గ్రామ స్వరూపం మారింది
పల్లె ప్రగతితో గ్రామ స్వరూపం మారింది. గ్రామంలో అభివృద్ధి పనులతో పాటు ప్రతి రోజూ ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. గ్రామంలో నాటిన మొక్కలు ఏపుగా పెరగడం, పల్లె ప్రకృతివనంలో మొక్కలు గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గ్రామం సమస్యలు వీడి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది.