బాలి: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, యువ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-15, 21-19 తేడాతో సుపనిద (థాయిలాండ్)పై అలవోక విజయం సాధించింది. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో రౌండ్లో క్లారా (స్పెయిన్)తో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-17, 18-21, 21-17 పదో ర్యాంకర్ సునేయామ (జపాన్)ను చిత్తు చేశాడు. తర్వాతి రౌండ్లో లక్ష్య టాప్ సీడ్ కెంటా మొమోటా (జపాన్)తో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్వినీ, సిక్కిరెడ్డి జంట 9-21, 21-11, 21-18 అలెగ్జాండ్రా, పౌల్సన్ (డెన్మార్క్) ద్వయాన్ని ఓడించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం 17-21, 15-15 తేడాతో యె సిన్, టియో (మలేషియా) జోడీ చేతిలో పరాజయం పాలై నిష్క్రమించింది.