హిమాయత్‌నగర్, నవంబర్ 15: బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు స్ఫూర్తి దాయకమని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, తెలుగు అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు అకాడమి మాజీ ఉప సంచాలకుడు ఆచా ర్య జి.చెన్నకేశవరెడ్డి రచించిన జాతిరత్న పీవీ నరసింహారావు గ్రంథావిష్కరణ సోమవారం సాయంత్రం హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమి ప్రాంగణంలో జరిగిం ది.
తెలుగు అకాడమి మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అవ్వం పాండయ్య అధ్యక్షతన జరిగిన సభకు కేశవరావు హాజరై మాట్లాడారు. పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ పూనుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఆర్థికవేత్త, తత్వవేత్త, సామాజిక, రాజకీయవేత్త అయిన పీవీ చాలా క్లిష్టమైన కాలమాన పరిస్థితుల్లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేసిన వ్యక్తి పీవీ అని, మైనార్టీ ప్రభుత్వాన్ని చాణక్యునిలా నడిపారని గుర్తు చేశారు. ఈ గ్రంథంలో పీవీని గ్రంథకర్త చెన్నకేశవరెడ్డి స్థిత ప్రజ్ఞులనటం సమంజసమన్నారు. పీవీ బహుముఖీన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదని, వారి పై మరిన్ని రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంఎల్సీ సురభి వాణీదేవి ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ, దేశంలో ఏ అకాడమి చేయని కృషి తెలుగు అకాడమి చేస్తుందన్నారు. వేల యేండ్ల చరిత్ర కలిగిన దేశంలో దక్షిణాది నుంచి వింధ్య పర్వతాలు దాటి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. పీవీపై ఉన్న మక్కువతో 77 ఏండ్ల వయస్సులో ఉన్న గ్రంథకర్త చెన్నకేశవరెడ్డి ప్రామాణికమైన గ్రంథం రాయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. వివిధ అధ్యాయాల వారీగా పీవీ గ్రంథాన్ని రాసిన రచయితను పలువురు అభినందించారు.