బీజేపీ, కాంగ్రెస్ మధ్య వంతులవారీగా అధికారం మారే సంప్రదాయం ఉన్న ఉత్తరాఖండ్‌లో సోమవారం ఒకేదఫాలో ఎన్నికలు జరుగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 సీట్ల మెజారిటీ అనివార్యం. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిన దేవభూమిలో జెండా పాతేదెవరు?
బీజేపీ: గెలుపు తేలిక కాదు
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 57 స్థానాలను గెలుచుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది. గతేడాది జూలైలో కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్ ధామీ అన్నీ తానై పార్టీ ప్రచారం నిర్వహించారు. రైతులకు రూ. 6 వేల సాయం, కుటుంబ బాధ్యతను తీసుకొంటున్న మహిళలకు నెలకు రూ. 2 వేలు, పిల్లల సంరక్షణకు మరో వెయ్యి అదనంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కేదార్నాథ్ రీ-డెవలప్మెంట్, చార్దామ్ రోడ్డు, రిషికేశ్-కర్ణ్‌ప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు తమకు ప్రజా మద్దతు లభించేలా చేస్తాయని ఆ పార్టీ భావిస్తున్నది. అయితే నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలను మార్చడం, ధర్మసంసద్, దేవస్థానాల మేనేజ్మెంట్, సాగుచట్టాలు వంటి వివాదాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇటీవలి బడ్జెట్లో రాష్ర్టానికి పెద్దగా నిధులు కేటాయించకపోవడం కాషాయ పార్టీపై ప్రజల్లో అసంతృప్తిని రేపుతున్నది.
కాంగ్రెస్: సర్వేలు ఓకే.. ఫలితమేంటో!
గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ను ఎలాగైనా ఈసారి అధికారంలోకి తీసుకురావాలని మాజీ సీఎం హరీశ్ రావత్ దృఢనిశ్చయంతో ఉన్నారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం కోటా, అంగన్వాడీల వేతనాన్ని 150 శాతం వరకు పెంచడం వంటి హామీలతో ఓటర్లు, ముఖ్యంగా మహిళలను ఆకర్షించే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్నది. హరక్సింగ్ రావత్ వంటి బీజేపీ కీలక నేతలు పార్టీలో చేరడం కలిసొచ్చింది. సీఎంగా హరీశ్‌కు మద్దతునిస్తున్నట్టు పెద్దఎత్తున ప్రజలు సర్వేల్లో పేర్కొనడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నది. అయితే, గత పాలనలో అవినీతి ఆరోపణలు, సంస్థాగతంగా కిందిస్థాయిలో లోపాలు, రెబల్స్ తిరుగుబాటు ఆ పార్టీకి ఇబ్బందులుగా మారాయి.
ఆప్, బీఎస్పీ: రేసులో ఉన్నాయంతే
మాజీ సైన్యాధికారి కర్నల్ అజయ్ కొతియాల్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వాలనుకుంటున్నది. ఈ క్రమంలోనే గడిచిన ఆరునెలల్లో సగటున ప్రతీ మాసం ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్తు, అమర సైనిక కుటుంబాలకు పరిహారం వంటి హామీలిచ్చారు. దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న హరిద్వార్, రూర్కీ, కుమాన్ టెరాయ్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నది. అయితే, ఈ రెండు పార్టీల ప్రభావం అంతంత మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ ముఖచిత్రం
మొత్తం సీట్లు: 70
కనీస మెజారిటీ: 36
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 14