Puri Jagannath | ఇటీవల సోషల్ మీడియాను ఓ చిన్న వీడియో ఊపేస్తోంది. రెండు పెంగ్విన్లు కనిపించే ఆ క్లిప్‌లో ఒకటి అక్కడే నిలిచిపోతే, మరో పెంగ్విన్ మాత్రం ఎవరి మాట వినకుండా మంచుపై కొండ వైపు నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు నెట్టింట ‘ఆ ఒక్క పెంగ్విన్’గా మారి ట్రోల్స్, మీమ్స్, చర్చలకు కేంద్రబిందువైంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏంటంటే… ఇది కొత్త వీడియో కాదు, దాదాపు 15 ఏళ్ల క్రితం తీసిన దృశ్యం. అయినప్పటికీ, ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతోంది? అన్న ప్రశ్నలకు తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మొదట ఈ వీడియో చూసినవాళ్లకు పెద్దగా అర్థం కాలేదు. “ఒకటి అక్కడే ఎందుకు ఆగిపోయింది? ఇంకొకటి ఎందుకు నీటిలోకి వెళ్లకుండా కొండ వైపు నడిచిపోయింది?” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెట్టారు. కొందరు దీన్ని మనుషుల జీవితాలతో పోల్చుతూ, బ్రేకప్ మీమ్స్‌గా మార్చేశారు. అలా అలా ఈ వీడియో వైరల్ అయిపోయింది.
అయితే ఈ పెంగ్విన్ ప్రవర్తన వెనుక ఉన్న అసలు భావోద్వేగాన్ని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఓ సందర్భంలో వివరించారు. పెంగ్విన్ల జీవనశైలి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చాయి. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామికి చాలా నిబద్ధంగా ఉంటుందని, ఒకసారి జోడీ కుదిరితే జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తుందని పూరి పేర్కొన్నారు. కానీ ఆడ పెంగ్విన్ నమ్మకాన్ని వంచిస్తే, ఆ వియోగాన్ని మగ పెంగ్విన్ తట్టుకోలేకపోతుందని చెప్పారు. అప్పుడు అది తన గుంపును, సముద్రాన్ని కూడా వదిలేసి ఒంటరిగా దూరంగా వెళ్లిపోతుందని, చివరకు ఆ ఒంటరితనం దాని జీవితానికే ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటి సంఘటనకు ప్రతీక కావచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక పెంగ్విన్ అక్కడే ఆగిపోవడం, మరొకటి నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోవడం వెనుక విషాద కథ దాగి ఉందని అనుకుంటున్నారు. అప్పటివరకు సరదాగా చూసిన వీడియో, ఈ కోణం తెలిసిన తర్వాత చాలా మందికి ఎమోషనల్‌గా అనిపిస్తోంది. అన్నేళ్ల క్రితం తీసిన వీడియో ఇప్పుడు తిరిగి వెలుగులోకి రావడానికి కారణం ఇదే భావోద్వేగ కనెక్ట్ కావచ్చని సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు. చిన్న క్లిప్ అయినా, దాని వెనుక ఉన్న అర్థం తెలిసిన తర్వాత ‘ఆ ఒక్క పెంగ్విన్’ ఇప్పుడు నవ్వులకే కాదు, మనుషుల సంబంధాలపై ఆలోచనలకు కూడా దారి తీస్తోంది.