Om Shanti Shanti Shantihi | ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, నేటివిటీ, ఎటకారాలు, రిలేషన్షిప్ డ్రామాతో నిండిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ట్రైలర్‌ను గమనిస్తే, పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య సహజంగా వచ్చే చిన్నచిన్న గొడవలు, భర్త ఇగో వల్ల భార్య ఎదుర్కొనే సమస్యలు కథకు కేంద్రబిందువుగా కనిపిస్తున్నాయి.
మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది?” అంటూ పెళ్లి చూపుల సన్నివేశంతో ప్రారంభమయ్యే ట్రైలర్, ఆ తర్వాత చేపల పేర్లతో సాగే హాస్యభరితమైన సీన్స్‌తో ప్రేక్షకులను నవ్విస్తుంది. పెళ్లికి ముందు, తర్వాత వచ్చే మార్పులు, భర్త పెత్తనం చెలాయించాలనుకోవడం, ఆ ఇగోతో ఇబ్బంది పడే భార్య చివరకు ఎలా స్పందించింది? అనే కొత్త కోణంతో కథను నడిపించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఎంత కొట్టినా, ఎంత భరించినా చివరకు భార్య ఒక్కసారి తిరగబడితే పరిస్థితి ఎలా మారుతుంది? భర్త ఈగోకు భార్య ఇచ్చే సమాధానం ఏంటి? అన్నదే ఈ సినిమా ప్రధానాంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా “మన గోదారోళ్లకు ఎటకారాలు సూటైనట్టు ప్రతీకారాలు సూట్ కావురా” అంటూ బ్రహ్మాజీ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
కామెడీతో పాటు ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథతో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ తెరకెక్కినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తనదైన శైలితో అలరించిన తరుణ్ భాస్కర్, హీరోగా కూడా అదే నేచురల్ యాక్టింగ్, టైమింగ్‌తో మెప్పించనున్నాడనే అభిప్రాయం ట్రైలర్ చూస్తే కలుగుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే ఈ సరదా, సీరియస్ సంగతుల మేళవింపు చివరకు ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అన్న ఆసక్తిని ట్రైలర్ ప్రేక్షకుల్లో కలిగిస్తోంది.