Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్(Puri Musings) అనే పేరుతో పూరీ తన భావలతో వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. అయితే తాజాగా పూరీ ‘సిల్క్ రోడ్’పై అనే అంశంపై మాట్లాడారు. ఈ రోడ్లో ప్రయాణించడం ఎంతో ప్రమాదకరమన్న ఆయన.. ఆ దారిలో వెళితో ప్రాణాలతో వస్తామో లేదో అని తెలిపారు.
పూర్వం చైనా నుంచి యూరప్ వరకు ఒక కనెక్టింగ్ రూట్ ఉండేది. దానిని సిల్క్ రోడ్ అని పిలుస్తారు. చైనా సిల్క్ అంటే యూరప్ వాళ్లకి విపరీతమైన డిమాండ్ ఉండేది. సిల్క్ వ్యాపారం కోసం మొదలైన దారి ఇది. హాన్ సామ్రాజ్యం ఉన్న సమయంలో చైనా సెంట్రల్ ఆసియాతో వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. 36 దేశాలను కలుపుతూ దాదాపు 6,400 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ ప్రాచీన వాణిజ్య మార్గం నిజంగానే సాహసోపేతమైన ప్రయాణంగా ఉండేది. చైనా, మంగోలియా,ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, కజకిస్థాన్, సిరియా, టర్కీ వంటి ఇలా ఎన్నో దేశాలను కలుపుతూ ఈ రూట్ ఉండేది. ఈ రూట్లో వెళ్లినవారు ప్రాణాలతో తిరిగివచ్చిన వారు చాలా తక్కువ. చాలా ప్రమాదకరమైన మార్గమిది. ఎందుకంటే గోబీ వంటి ఎడారులను దాటుకుంటూ వెళ్లాలి. ఇసుకు తుఫానులను దాటాలి. పైగా విపరీతమైన హై టెంపరేచర్స్ ఉండేవి. ఒంటేలు గుర్రాలు లేకుండా ఎవరూ ట్రావెల్ చేసేవారు కాదు.
చైనా నుండి టర్కీలో ఉన్న అనటోలియా అనే ప్రదేశం చేరాలంటే ఒక సంవత్సరం పైనే పట్టేది. ఇందులో సిల్క్ ఒకటే కాదు ఇండియా నుండి మసాలా, కుంకుమ, దాల్చిన చెక్క, మిరియలు ఎగుమతి అయ్యేవి. చైనా నుంచి ఏనుగు దంతాలు, రోమ్ నుండి బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు ఈ మార్గం ద్వారా ఒకరి నుండి మరొకరికి చేరేవి. ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు జోరుగా సాగేవి.
ఈ రహదారి ద్వారానే ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవ మతాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాపించాయి. తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య భావాలు, నమ్మకాలు పంచుకోబడ్డాయి. మొట్టమొదటిసారిగా చైనా వాడు తయారుచేసిన కాగితం, గన్‌పౌడర్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందాయి. ఇతర దేశాలన్నీ వాటిని కొనవలసి వచ్చింది. ఒకానొక సమయంలో ఈ మార్గం చంఘిజ్ ఖాన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది. అయితే, వారి పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలు కూడా ఉండేవి. ఆ తరువాత మార్కో పోలో వంటి యాత్రికులు ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటూ కాగితం, బొగ్గు వంటి వస్తువులను అమ్మడం ప్రారంభించారు. సిల్క్ రోడ్ నిజంగానే చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
పూరి ఇంకా మాట్లాడుతూ.. ఈ రూట్ మధ్యలో దోపిడీ దొంగలు దాడి చేసేవారని తెలిపాడు. వారినుంచి తప్పించుకోవడానికి అందరూ వెయ్యి ఒంటెలతో ప్రయాణించేవారు. ఈ రూట్లో వ్యాపారం చేయాలంటే కత్తి పట్టుకొని బయల్దేరాలని అన్నాడు. దాదాపు 1500 సంవత్సరాల పాటు ప్రపంచమంతా ఈ సిల్క్ రోడ్నే ప్రధాన వాణిజ్య మార్గంగా ఉపయోగించిందని తెలిపారు. ఈ మార్గంలో వ్యాపారం చేసేవారు ఒక ప్రత్యేకమైన భాషను ఉపయోగించేవారని, దాని పేరు “మాలి” అని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత సముద్ర మార్గం కనుగొనబడటంతో, సిల్క్ రోడ్డు ద్వారా జరిగే ప్రయాణాలు క్రమంగా తగ్గిపోయాయని పూరి వివరించారు. అయితే, ప్రపంచీకరణకు (World Globalization) ఇది మొట్టమొదటి కారణంగా నిలిచిందని ఆయన అన్నారు. సంస్కృతి, సాంకేతికత, మతాలు ఇలా ఎన్నో విషయాలు ఈ మార్గం ద్వారానే ఒకరి నుండి మరొకరికి చేరాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కొంతమంది యాత్రికులు సాహసం కోసం ఈ సిల్క్ రోడ్లో ప్రయాణిస్తున్నారని పూరి తెలియజేశారు.