హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : హౌసింగ్ బోర్డు లీజుకు ఇచ్చిన భూములు, దుకాణాల క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు ఆ షాపులను కొనుగోలు చేయడానికి ముందుకొస్తే మారెట్ ధర ప్రకారం విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఒకవేళ షాపుల నిర్వహణకు ఆ స్థలాలు అనువుగా లేకపోతే వేలంలో విక్రయించాలని స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు ఆస్తులపై సోమవారం ఆయన సచివాలయంలో సం బంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హౌసింగ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు లీజు, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
హౌసింగ్ బోర్డుకు చెందిన 7 స్థలాలపై కోర్టు కేసులు, అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో లీజు ఒప్పందాన్ని పునరుద్ధరించుకోని సంస్థలకు బోర్డు తరఫున లేఖలు రాసి, వాటి రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారు. కోర్టు కేసుల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా అడ్వకేట్‌ను నియమించుకోవాలని తెలిపారు. హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇండ్లకు పకనే ఉన్న 100 గజాల్లోపు స్థలాలను ఆ ఇండ్ల యజమానులకు విక్రయించాలని, గతంలో ఇండ్ల కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్ధలాలను రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఆ స్థలాల పక్కనే ఉన్న 100 గజాల్లోపు స్థలాన్ని కూడా వారు కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు, వాటి పక్కన 100 గజాల్లోపు ఉన్న స్థలాలు, వాటి మార్కెట్ ధర, సబ్‌రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ, ఆ స్థలాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నవారి వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఆ స్థలాలపై క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.