హైదరాబాద్, ఆట ప్రతినిధి, శేరిలింగంపల్లి: జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గోపీచంద్ జీవిత విశేషాలతో ప్రముఖ రచయిత ప్రియ కుమార్ రాసిన ‘షట్లర్స్ ఫ్లిక్ -మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి గోపీచంద్ ఎనలేని సేవ చేశాడు. నిబద్ధతతో కూడిన పనితనంతో హైదరాబాద్‌ను బ్యాడ్మింటన్ కేంద్రంగా మలిచాడు. అత్యుత్తమ శిక్షణ ద్వారా ఎంతో మంది చాంపియన్లను తీర్చిదిద్దాడు. గత 20 ఏండ్లుగా బ్యాడ్మింటన్‌కు గోపీ చేసిన సేవలు వెలకట్ట లేనివి. అర్జున, ద్రోణాచార్య, పద్మభూషణ్, రాజీవ్‌ఖేల్ రత్న.. ఎలాంటి అవార్డుకైనా ఆయన అర్హుడు. భవిష్యత్‌లో ఫ్యాక్టరీల (అకాడమీల) ద్వారా మరింత మంది యువతను మెరికల్లాగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. గోపీచంద్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో కుటుంబసభ్యుల పాత్ర మరువలేనిది. సమిష్టి కృషితో ఈ స్థాయికి చేరుకోగలిగారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ డీన్ మదన్, శోభిత నారాయణ్, మోహిత్ బాత్రా తదితరులు పాల్గొన్నారు.