జూబ్లీహిల్స్, మార్చి29: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నది ఆ అమ్మాయి. బరిలోకి దిగితే ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ అదరగొడుతున్నది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో చెలరేగుతూ ఉడుం పట్టుతో ప్రత్యర్థి రెజ్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న ఆ యువ రెజ్లర్ మరెవరో కాదు పూజ నిత్లేకర్. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో పాట్నా వేదికగా జరుగనున్న అండర్-15 ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పూజ బరిలోకి దిగుతున్నది. నాంపల్లిలోని రతన్‌సింగ్ వస్తాద్ వ్యాయామశాలలో తన తండ్రి చంద్రకాంత్ నిత్లేకర్ దగ్గర శిక్షణ పొందుతున్న ఈ యువ రెజ్లర్.. జాతీయ టోర్నీలో సత్తాచాటాలని చూస్తున్నది. తాను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలన్న లక్ష్యంతో చిన్ననాటి నుంచి చంద్రకాంత్.. పూజకు కుస్తీ విద్యలో శిక్షణ ఇస్తున్నాడు. తండ్రి నేర్పిన మెళకువలతో రాటుదేలుతున్న పూజ ఇటీవల నల్లగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నీలో పసిడి పతకంతో మెరిసింది. ఆ తర్వాత రాంచీలో జాతీయస్థాయి టోర్నీలోనూ ఆకట్టుకుంది. మరోవైపు పూజతో పాటు శిక్షణ పొందుతున్న కుశాల్ కూడా పాట్నా టోర్నీలో పోటీపడుతున్నాడు.