హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు, కార్మికుల భద్రతకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు విమర్శించారు.
ఆదివారం వారు హైదరాబాద్లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏండ్ల తర్వాత కూడా విభజన చట్టంలోని అంశాలను పరిషరించేందుకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన నరేంద్రమోదీ సర్కారు అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు జరపకుండా రైతాంగాన్ని మరోసారి మోసగించిందని, రైతు రుణమాఫీ, ధరల స్థిరీకరణ, ఉపాధి హామీ పథకాలకు నిధులు పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.