‘ఈ సినిమాలో నేను స్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళ పాత్రలో కనిపిస్తా. పర్ఫార్మెన్స్కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలొస్తాయనే నమ్మకం ఉంది’ అని చెప్పింది యామిని భాస్కర్. ఆమె శ్రీనందు సరసన కథానాయికగా నటించిన ‘సైక్ సిద్ధార్థ’ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. వరుణ్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనందు, శ్యాంసుందర్ రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా గురువారం యామిని భాస్కర్ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకుంది.
ఈ సినిమాలో తాను విడాకులు తీసుకున్న మహిళ పాత్రలో కనిపిస్తానని, తనకు ఓ బాబు కూడా ఉంటాడని, పర్ఫార్మెన్స్ పరంగా ఛాలెంజింగ్ రోల్ ఇదని చెప్పింది. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రావ్య. తను ఓ విఫల బంధం నుంచి బయటపడి స్వతంత్రంగా జీవించాలనే ఆలోచనతో ఉంటుంది. అదే సమయంలో హీరోకి బ్రేకప్ జరుగుతుంది. అతను అన్నీ వదిలేసి బస్తీలో ఉండటానికి వస్తాడు. అక్కడ మా ప్రేమకథ మొదలవుతుంది. సహజత్వం కలబోసిన ప్రేమకథగా ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్యారెక్టర్ నచ్చితే ఓటీటీ సినిమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని యామిని భాస్కర్ చెప్పింది.