సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/ మారేడ్‌పల్లి: మావొస్టుల ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేశ్‌కు మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి మహమూద్ అలీ వైద్యులకు సూచించారు. సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై హోం మంత్రితో పాటు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, గ్రే హౌండ్స్ అడిషనల్ డీజీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్డీ దయానంద్‌లు గురువారం వాకబు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు, బంధువులను పరామర్శించారు.
అనంతరం, హోంమంత్రి మాట్లాడుతూ, కానిస్టేబుల్ కుటుంబానికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వ పరంగా అందజేస్తామని భరోసా ఇచ్చారు. కాగా ఈ నెల 18న ములుగు-బీజాపూర్ జిల్లాల సరిహద్దు పరిధిలోని కర్రిగుట్టల అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహేశ్ భుజానికి బుల్లెట్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే. గత బుధవారం భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని వైద్యులు హోం మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిచ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.