‘కదురాడిన ఇంట్ల, కవ్వమాడిన ఇంట్ల కరువుండది’

కష్టపడి పనిచేసేవారి ఇంటి దరిదాపుల్లోకి కరువు రాదని జానపదులు అనుభవ పూర్వకంగా చెప్పిన సామెత ఇది. మన కష్టాన్నిబట్టే ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలమే కరువు నుంచి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది. కదురు, కవ్వాలు నిరంతర శ్రమకు ప్రతీకలు. కదురంటే పత్తిని, గింజను రాట్నం మీద వేరుచేసే సాధనం. కొన్ని చేత్తో తిప్పే కదుర్లూ ఉంటాయి. అయితే, కదురు, కుదురుకి చాలా తేడా ఉంది. కుదురులో వడ్లు పోసి దంచుతారు. ఆ కుదురు పొందికగా ఉంటే దంచే వడ్లు, పప్పులు, ధాన్యాలు బయటికి పోకుండా ఉంటాయి. అందుకే ‘ఓ చోట కుదురుగా ఉండు’ అంటారు పెద్దలు. ఇక, కవ్వం ఆడిన ఇంట్లోకి కరువు రాదు. ఓ ఇంట్లో నిత్యం కవ్వం ఆడుతుందంటే ఆ కుటుంబం పాడి పశువులతో, వ్యవసాయంతో కళకళలాడుతున్నదని అర్థం. ఆ ఇంట్లో అంతా కష్టపడి తలోపని చేసుకుంటారని భావన. తెలివితో పని చేస్తే, ఎంతటి కరువునైనా పారదోలొచ్చు అనేది ఈ సామెత సారాంశం.
‘ఏట్ల పచ్చిపులుసు పిసికినట్లు’

చేసే పనులు ఆచితూచి చెయ్యాలని, ఏ పనికైనా ఓ అర్థం ఉండాలని హెచ్చరించే సామెతే ‘ఏట్ల పచ్చిపులుసు పిసికినట్లు’. తెలంగాణలో పచ్చి పులుసుకు ఉండే ప్రాధాన్యమే వేరు. పేదల నుంచి ధనవంతుల వరకూ అందరి ఇండ్లలో చేసుకునే వంటకం పచ్చిపులుసు. ఓ గిన్నెలో చింతపండు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి కాల్చి ఇతర దినుసులు వేసి పులుసు కలపడం ఓ లెక్క. అలాంటిది ఏరు (నది)లో పిసికితే ఉపయోగం ఉంటుందా? అక్కరకు వస్తుందా? అలా చెయ్యడం వ్యర్థమైన పనే కదా! అందుకే మనం ఏ పని చేస్తున్నామో? ఎలా చేస్తున్నామో? ఎందుకు చేస్తున్నామో?.. తెలుసుకొని మొదలు పెట్టాలంటారు పెద్దలు. ఆ పని మనకో, కుటుంబానికో, యజమానికో, సమాజానికో ఉపయోగపడాలే తప్ప.. నిరుపయోగం కావొద్దని హెచ్చరించే సందర్భం. ఇలాంటి అర్థం వచ్చే మరో తెలుగు సామెత ‘బూడిదలో పోసిన పన్నీరు’.
‘ఆ కన్నమ్మ కష్టాలు మల్ల వద్దయ్యో’

జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఓ చోట విపరీతమైన కష్టాలు ఎదురవుతుంటాయి. ధైర్యవంతులు వాటిని ఎదుర్కొని నిలబడతారు. పిరికివారు ఆ కష్టాలకు భయపడి పారిపోతారు. ఒకసారి వచ్చిన అతిపెద్ద కష్టం.. మరోసారి ఎదురు కాబోతుంటే దానిని ఎదుర్కొనే ధైర్యంలేక ‘ఆ కన్నమ్మ కష్టాలు మల్ల వద్దయ్యో దేవుడా!’ అంటారు. కరోనా మొదటివేవ్లో ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. ప్రాణభయంతో పొట్టచేతబట్టుకొని, పిల్లలను భుజాన వేసుకొని, వందల కిలోమీటర్లు నడిచి ప్రాణాలు దక్కించుకున్నవారున్నారు. ఇప్పుడా కష్టాలు మళ్లీ వస్తాయని తెలిస్తే ఆ కన్నమ్మ కష్టాలు మళ్లీ వద్దనే అంటారు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లిపడే ప్రసవ వేదన నుంచి ‘కన్నమ్మ కష్టం’ అనే పలుకుబడి వచ్చిందని చెబుతారు. ఆ వేదన, కష్టంగా అనిపించే బాధ, బిడ్డను కనే అమ్మకు మాత్రమే తెలుసు. అందుకే ‘కన్నమ్మ కష్టం’ అన్నారు.
- డప్పు రవి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Proverbs
- Proverbs news
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

