జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల( Gadwal ) జిల్లాలో మరోసారి కాంగ్రెస్ ( Congress ) వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తు మంత్రి ఎదుట మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్పర్సన్ వర్గీయులు నిరసన తెలిపారు. ధరూర్ మండల కేంద్రంలో శనివారం భూభారతి (Bhubharati ) నూతన ఆర్వోఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas reddy ) ముఖ్య అతిథిగా హాజరుకాగా స్టేజీ పైకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిని ఆహ్వానించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితను ఆహ్వానించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి ( MP Mallu Ravi ) కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు.
ఎమ్మెల్యే పార్టీ కండువా వేసుకొని స్టేజీపైకి వెళ్లాలని, ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ సరిత వర్గీయులు ఆందోళన చేపట్టారు. ప్రతిసారి తమను అవమానాలకు గురి చేస్తున్నారని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. సమావేశం మొదలైనప్పటి నుంచి మంత్రి పొంగులేటి మాట్లాడే వరకు కార్యకర్తలు వారి ప్రసంగాలకు అడ్డు తగులుతూనే వచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలి అవకాశం కోసం పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కించడం ఏంటని మల్లురవిని ప్రశ్నించారు. పోలీసులకు సరిత వర్గీయుల మధ్య కొంతసేపు మాటలు యుద్ధం జరిగింది. ఎట్టకేలకు పోలీసుల వారిని శాంతింప చేసి అక్కడి నుంచి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సరితతో మాట్లాడి గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .