హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ మల్లేశం, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌తో ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో కొత్తగా నిర్మించనున్న మినీ క్రీడా మైదానాలకు అనుమతులు, పర్యాటక అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడా, పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. అధికారులు నియోజకవర్గాల్లో పర్యటించి మైదానాలు, పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి సూచించారు.