న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ‘వరకట్నం వల్ల లాభాలేంటంటే.. కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. బైక్, ఫ్రిజ్ ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనుగోలు చేయవచ్చు. అందంగా లేని ఆడపిల్లలకు పెండ్లి కావడంలో వరకట్నం చాలా దోహదం చేస్తుంది’ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లోని సోషియాలజీ పుస్తకంలో ఓ పేరాలో ఉన్న విషయమిది. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ అంశా న్ని వెంటనే సిలబస్ నుంచి తొలగించాలని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఈ పుస్తకం విద్యావ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ఈ పేరాను ఫొటో తీసి చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. లక్షలాది మంది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడానికి, వేలాది మంది ఆడపిల్లల ఆత్మహత్యలకు కారణమైన వరకట్న దురాచారాన్ని సమర్థించడం, లాభాలున్నాయని బోధించడం ఏంటని మండిపడుతున్నారు.