హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 31: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం సంచాలకులు, అర్థశాస్త్ర విభాగాధిపతి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్‌లాల్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వేల్స్యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 108వ వార్షికోత్సవ సమావేశంలో జాతీయస్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ర్టంలో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఈ పదవి అలంకరించిన మొదటి వ్యక్తిగా సురేష్‌లాల్ కావడం గర్వకారణమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు.
ఈ సందర్భంగా సురేష్‌లాల్ మాట్లాడుతూ 100 సంవత్సరాలపైగా చరిత్ర కలిగిన ఈ అసోసియేషన్‌లో డాక్టర్ మన్మోహన్సింగ్, ఆచార్య అమర్త్యకుమార్సేన్, రంగరాజన్ వంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ఆర్థిక వ్యవస్థలో పాలసీలను రూపొందించడానికి ఈ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం రిజిస్ట్రార్ రాంచంద్రంతో పాటు అర్థశాస్త్ర విభాగపు అధ్యాపకులు, విద్యార్థులు సురేష్లాల్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మోహన్‌రెడ్డి, విద్యాసాగర్, సాంబశివరావు, రాజేష్, రమేష్, హరిశంకర్, బోధనేతర సిబ్బంది కొమరమ్మ, విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.