వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 22: ఉద్యాన వర్సిటీ కళాశాలలో చదివిన, పనిచేసిన వారు దేశ నలుమూలలా అనేక హోదాల్లో ఉన్నారని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాల డీన్ గీర్వాణీ అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 2007 ప్రారంభమైన కళాశాలలో విద్యనభ్యసించిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. ఇటీవల జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, నెట్ తదితర రంగాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారన్నారు.
ఆలిండియా లెవల్ (ఐసీఏఆర్)లో 17 మంది, సీనియర్ రీసెర్చ్ఫెలో ఇద్దరు, నెట్లో మరి కొందరు ప్రతిభ కనబర్చారన్నారు. ఈ కళాశాల విద్యార్థులు ప్లాంట్బ్రీడింగ్, ఎంటమాలజీ, ఫెథాలజీ, ఎకనామిక్స్ తదితర రంగాల్లో కూడా రాణించారని తెలిపారు. బీఎస్సీ హార్టికల్చర్ 19 మంది విద్యార్థులకు తమిళనాడు, మహారాష్ట్రలో పేరొందిన కళాశాలో పైచదువులకు అవకాశం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా.లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మి, రాజాగౌడ్, డా.నాగహర్షిత, నిరోష, తదితరులు పాల్గొన్నారు.