
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావును పారిస్‌లో అనుకోని ఆత్మీయ అతిథి కలిశారు. మూడు దశాబ్దాలకుపైగా తెలు గు భాషపై పరిశోధనచేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ ఆదివారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తెలుగుపై నెగర్స్ పట్టును చూసి కేటీఆర్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్’లో దక్షిణాసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నెగర్స్ తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారు. తన పరిశోధన వివరాలను కేటీఆర్‌కు వివరించారు. ‘వేల మైళ్ల దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం’ అని కేటీఆర్ ప్రశంసించారు.