హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టీచర్ పోస్టులే కాదు.. టీచర్లను తయారుచేసే ప్రభుత్వ డైట్ కాలేజీలు, బీఈడీ కళాశాలల్లోనూ ఫ్యాకల్టీ పోస్టులు ఎన్నో ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో విద్యారంగానికి దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైతం నిర్వీర్యమవుతున్నది. ఈ సంస్థలోనూ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యా పరిశోధన-శిక్షణలో అత్యంత కీలకమైన ఈ సంస్థలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎందరున్నారంటే, వేళ్లపై లెక్కబెట్టేంత మంది మాత్రమే. రాష్ట్రంలో 10 ప్రభుత్వ డైట్ కాలేజీలుండగా, 286 పోస్టులకు పట్టుమని 10 మంది కూడా లేకపోవడం గమనార్హం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం డైట్ కాలేజీల్లో 50 సీట్లుంటే 8మంది, 100 సీట్లున్న కాలేజీలో 16, 150 సీట్లున్న కాలేజీలో 24 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. కానీ, ఇంతకాలం గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొచ్చారు. ఇప్పుడు డిప్యుటేషన్‌పై అర్హులైన టీచర్లను వినియోగించుకోనున్నారు.
పాఠశాల విద్యకు మార్గదర్శకత్వం వహించే రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు ప్రొఫెసర్ పోస్టులతోపాటు 13 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. ఇవే కాకుండా మరికొన్ని పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఇన్నాళ్లూ ఆన్‌డ్యూటీలు, ఇన్చార్జులతో నెట్టుకొచ్చారు. తాజాగా మొత్తం 18 పోస్టులను డిప్యుటేషన్/ఫారిన్ సర్వీస్‌లో భర్తీచేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. ఇవేకాకుండా ప్రభుత్వ బీఈడీ కాలేజీల్లోనూ వందల సంఖ్యలో ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, నాగార్జునసాగర్‌లోని కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లలో 12 చొప్పున మొత్తం 36 మంది లెక్చరర్ల కొరత వేధిస్తున్నది.
డైట్, బీఈడీ కాలేజీలు, ఎస్సీఈఆర్టీలోని ఖాళీ పోస్టులను డిప్యుటేషన్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్ ప్రాతిపదికన భర్తీచేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డైట్ కాలేజీల్లో 131, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్‌లో 36, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్‌లో 17, ఎస్సీఈఆర్టీలో 18 పోస్టుల చొప్పున 202 పోస్టులను భర్తీచేయనున్నది. సర్కార్ బడుల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూలై 4 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూలై 25 నుంచి 31 వరకు రాత పరీక్షలు, ఆగస్టు 6, 8 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన టీచర్లకు ఆగస్టు 10న డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీచేస్తారు.