హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్టాత్మక తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేశ్‌ను ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో-121ను జారీచేశారు. ఏడాదిపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారని జీవోలో పేర్కొన్నారు. గతంలో భట్టు రమేశ్ రెండు పర్యాయాలు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా సేవలందించారు.
గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతిగా, గిరిజన అధ్యయనశాఖ అధిపతిగా, తెలుగు వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. బంజారా భారతి, బంజారా గణితం వంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వరంగల్ జిల్లాలో గుడుంబా బాధితులైన 200 మంది వితంతువుల పునరావాసం కోసం కృషిచేశారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం అందుకొన్నారు. కీలకమైన తెలుగు అకాడమీ సారథ్య బాధ్యతలను ఆయనకు అప్పగించడంపై గిరిజన సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు.