న్యూఢిల్లీ, మార్చి 29: ఫార్మాస్యూటికల్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ స్కీమ్) ప్రకటించిన తర్వాత 35 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐలు, తుది ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు) దేశీయంగా ఉత్పత్తవుతున్నాయని కేంద్ర ఎరువులు, రసాయినాల మంత్రి మాన్సుఖ్ మాండవియా చెప్పారు. గతంలో ఈ ఏపీఐల్ని మనం దిగుమతి చేసుకునేవారమని, మొత్తం 53 ఏపీఐల దిగుమతులపై భారత్ ఆధారపడి ఉండగా, వాటిలో 35 ప్రస్తుతం దేశంలోనే తయారవుతున్నాయన్నారు. ఈ 35 ఏపీఐలు వివిధ కంపెనీలకు చెందిన 32 ప్లాంట్లలో ఉత్పత్తవుతున్నాయని మాండవియా మంగళవారం మీడియాకు తెలిపారు. ఫార్మా రంగానికి గత ఏడాది రూ.15,000 కోట్ల పీఎల్ఐ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్‌కు మంచి స్పందన లభించిందని, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మా, లుపిన్, మైలాన్ ల్యాబ్, సిప్లా, క్యాడిల్లా హెల్త్కేర్లతో సహా 55 కంపెనీలు పీఎల్ఐ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత సాధించాయని మంత్రి వివరించారు.