హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు పట్టం కడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇందుకోసం ఆయా సర్కార్ స్కూళ్లకు సమీపంలోనే కార్పొరేట్ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం ప్ర భుత్వం తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 23వేల సర్కార్ బడుల మూసివేతకు రంగం సిద్ధమైందనే వాదనల నేపథ్యంలో సర్కార్ పెద్దల వ్యవహారశైలి ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. పేదింటి బిడ్డలను చదువులకు దూరం చేసే ప్రయత్నంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
30శాతం బడుల్లో 60శాతం విద్యార్థులు రాష్ట్రంలో 60.77లక్షల విద్యార్థులుంటే 36.17 లక్షల విద్యార్థులు (60 శాతం) ప్రైవేట్ బడుల్లో చదువుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లు 11,407 (28.98శాతం) ఉన్నాయి. అంటే 28.98 శాతం బడుల్లో 59.53శాతం విద్యార్థులున్నారన్న మాట. సర్కార్ బడులు 24,997 (63 శాతం) ఉండగా, వీటిలో వి ద్యార్థుల నమోదు 19.30లక్షలే. రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో కేవలం 31.76శాతమే స ర్కార్ బడుల్లో చదువుతున్నారు. అత్యంత దా రుణమైన విషయం ఏమిటంటే 100 మంది విద్యార్థుల్లో కేవలం 26 మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేరుతున్నారు. 74 మంది ప్రైవేట్‌లోనే చేరుతున్నారు.
రాష్ట్రంలో ఏటా 300 వరకు కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతులిస్తున్నది. ప్రైవేట్ కిండర్ గార్డెన్, ప్రీ స్కూళ్లను పూర్తిగా గాలికొదిలేసింది. నిబంధనల ప్రకారం ఒక స్కూల్‌కు కిలోమీటర్ దూరంలో మరో స్కూల్ ఉండరాదు. కొత్త స్కూళ్లకు అస్సలు అనుమతినివ్వరాదు. లిక్కర్ షాపులకు సమీపంలో అసలు స్కూల్స్‌కు అనుమతి మంజూరు చేయరాదు. కానీ సర్కార్ స్కూళ్ల గోడలకు ఆనుకొనే స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. వెయ్యి మీటర్లు దేవుడెరుగు.. 50, 100 మీటర్ల లోపే ఏర్పాటవుతున్నాయి. పాఠశాల విద్యారంగంలో సీబీఎస్ఈ స్కూళ్ల హవా కొనసాగుతున్నది. పదో తరగతి వరకు అత్యధికులు ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ బడులనే ఎంచుకుంటున్నారు.
అబిడ్స్‌లో మహబూబియా, ఆలియా ఉ న్నత పాఠశాలలకు ఏండ్ల చరిత్ర ఉంది. ఈ పాఠశాలకు దగ్గరగా 3 పెద్ద ప్రైవేట్ స్కూళ్లున్నాయి. 100 మీటర్ల లోపే స్లేట్ స్కూల్ ఉండగా.. పక్కనే స్టాన్లీ, ఆ పక్కనే లిటిల్ ఫ్లవర్, సుజాత స్కూల్స్ ఉన్నాయి.
సర్కార్ బడుల బలోపేతాన్ని పక్కన పెట్టి ఏకంగా రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ బడుల ఓపెనింగ్‌కు హాజరవడం విమర్శలకు తావిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి చెందిన ఏవీఎన్ లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్‌ను సీఎం స్వయంగా వెళ్లి ప్రారంభించారు. పైగా ఈ బడుల్లో ఫీజులు ఐదువేలు..పది వేలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సర్కార్ స్కూళ్లను తుంచాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో విద్యాశాఖ సీఎం వద్దే ఉండటంతో సర్కారీ విద్యకు మహర్దశ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. 27వేల స్కూళ్లను 4వేలకు కుదిస్తామని సీఎం స్వయంగా ప్రకటించడంతో ఉపాధ్యాయులే కాదు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు 2,046కు చేరాయి. ఇది వరకు ఈ స్కూళ్ల సంఖ్య 1,897 మాత్రమే. ఈ బడుల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 7,057 స్కూళ్లు 15 మందిలోపు విద్యార్థులతో నడుస్తున్నాయి. 12,583 స్కూళ్లు 30 మంది వి ద్యార్థులతోనే నడుస్తున్నాయి. ఏకంగా 4,832 స్కూళ్లు సింగిల్ టీచర్లతోనే నడుస్తున్నాయి. ఈ చర్యలతో సర్కార్ ఉద్దేశపూర్వకంగానే సర్కార్ బడులకు ఉరితాడు బిగిస్తున్నదని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
దేశంలో ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందంజలో ఉన్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలు ఇంజినీరింగ్, లా కాలేజీల ఏర్పాటుపై మారటోరియాన్ని విధించాయి. దేశంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు విచ్చలవిడిగా ఏర్పాటైన సందర్భంలో 2020- 2021 సంవత్సరంలో కొత్త కాలేజీ ఏర్పాటుపై ఏఐసీటీఈ మారటోరియాన్ని విధించింది. 2023-24 విద్యాసంవత్సరం వరకు కొత్త కాలేజీలను మంజూరు చేయలేదు.
అసలు దరఖాస్తులు స్వీకరించలేదు. కొంత కాలం క్రితం లా కాలేజీలను నియంత్రించేందుకు బార్ కౌన్సిల్ కూడా కొత్త కాలేజీలపై నిషేధం విధించింది. 2025లో మారటోరియం విధించింది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఉపసంహరించింది. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం కొత్త ఇంజినీరింగ్ సీట్లపై, కోర్ బ్రాంచీల సీట్లను సీఎస్ఈకి కన్వర్షన్ చేసేందుకు అనుమతించడం లేదు. ఇదే తరహాలో ప్రైవేట్ స్కూళ్లపై సర్కార్ ఎందుకు మారటోరియం విధించడంలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

