‘ఇరవయ్యవ పడిలో ఉన్న ఓ అమ్మాయి, నలభై ఏండ్ల వయసున్న వ్యక్తి ప్రేమలో పడితే వారి సంక్లిష్ట బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? వయోవ్యత్యాసం తాలూకు భావోద్వేగాలు, నైతిక సంఘర్షణ వారి బంధాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవాలంటే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూడాల్సిందే. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సూర్య, మమితాబైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రధారులు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ‘నేనో బటర్‌ఫ్లై..’ అనే తొలిపాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించారు. సుభాషిని ఆలపించారు. ‘పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగ, చుట్టా బొంగరంగా నిన్నే చుట్టుకోగ..గుడ్‌మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావే నాలో ప్రేమని, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్కమ్ అంటూ రమ్మని..నేనో బటర్‌ఫ్లై..’ అంటూ ప్రేమలోని భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ ఈ పాట సాగింది. హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాలను అలరించే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు.