అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడమే అందుకు కారణం. బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది.
శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇందులోని కాజల్ పోషిస్తున్న పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ప్రభుత్వ కార్యాలయ వాతావరణంలో.. ఫైళ్లు, అధికారిక పత్రాల మధ్య కళ్లజోడుతో హుందాగా నిలబడివున్న కాజల్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. కాజల్ గెటప్‌ని బట్టి, ఇందులో ఆమె ప్రభుత్వ అధికారిణి పాత్ర పోషిస్తున్నదని అర్థమవుతున్నది. ఆత్మవిశ్వాసం, నిబద్దత, స్థిరత్వం ఆమె కళ్లలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 1993 ముంబై నేపథ్యంలో ఉత్కంఠకు గురిచేసే హింసాత్మక ప్రపంచానికి ఎదురునిలిచే డేర్ డెవిల్‌గా ఇందులో కాజల్ కనిపించనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: అరవింద్ .ఎస్ కశ్యప్, సంగీతం: తమన్.