Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రిలీజ్ విషయంలో 2027 డిసెంబర్ 31 తేదీ తెరపైకి వచ్చినప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ కీలక విషయం మాత్రం అధికారికంగా బయటకు వచ్చింది. సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్ ‘రాకా’లో నటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. తాజాగా ఓ తెలుగు ఇంటర్వ్యూలో ‘రాకా’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. సినిమాలో తనకు ఓ ప్రముఖ పాత్రతో పాటు ప్రత్యేకమైన లుక్ ఉంటుందని తెలిపారు. దీంతో ‘రాకా’లో బబ్లూ పృథ్వీరాజ్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ‘రాకా’ షూటింగ్ అనుభవం గురించి కూడా బబ్లూ పృథ్వీరాజ్ మాట్లాడారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పిన ఆయన.. సినిమా మేకింగ్ భారీ స్థాయిలో ఉంటుందని సూచించారు.
అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంటర్నేషనల్ స్థాయి టెక్నికల్ టీమ్, హాలీవుడ్‌కు చెందిన నిపుణులు కూడా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా కాన్వాస్ ఎంత పెద్దదిగా ఉండబోతుందో ఈ వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో కలిసి ఇంత భారీ ప్రాజెక్ట్‌లో నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమని బబ్లూ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఇలాంటి భారీ కాన్వాస్ ఉన్న సినిమాలో భాగం కావడం తనకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాంటిదని చెప్పినట్లు తెలుస్తోంది.అయితే తన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. చిత్రబృందంతో చేసుకున్న ఒప్పందం కారణంగా సినిమా కథ, తన పాత్ర స్వభావం, లుక్ వంటి అంశాలపై మరిన్ని విషయాలు బయటపెట్టలేనని స్పష్టం చేసారు.