న్యూఢిల్లీ : పిల్లలకు కొవిడ్-19 టీకాల డ్రైవ్ ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేయనున్నట్లు నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్టీజీఐ) చైర్మన్ డాక్టన్ ఎన్కే అరోరా తెలిపారు. తీవ్రమైన అనారోగ్యం ఉన్న, కొమొర్బిడిటీలు ఉన్న పిల్లలకు మొదటగా టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు టీకాలు వేయొచ్చన్నారు. పిల్లలకు టీకాలు వేసేందుకు ప్రాధాన్యత ఎలా ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ.. తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
రాబోయే రెండు వారాల్లో జాబితా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆగస్ట్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు జైడస్ క్యాడిలా తయారు చేసిన ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ టీకా జైకోవ్-డీకి అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సిన్‌ను జాతీయ టీకా డ్రైవ్‌లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు, 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు వేసేందుకు అత్యవసర వినియోగ అనుమతి పొందిన ఏకైక టీకా ఇదే.
కాగా, ప్రస్తుతం పలు టీకాలు సైతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. కొవాగ్జిన్ ట్రయల్స్ కోసం అభ్యర్థుల ఎంపిక పూర్తవగా.. డేటా ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులో ఉండనుంది. మరో వైపు నోవావాక్స్ కొవిడ్ టీకా సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవోవాక్స్ పేరిట ట్రయల్స్ నిర్వహిస్తున్నది. 5-17 సంవత్సరాల పిల్లలపై ట్రయల్స్ చేపడుతోంది. టీకా ట్రయల్స్ డేటా ఫలితాలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నది. వచ్చే ఏడాదిలో రెండు, మూడు టీకాలు పిల్లలకు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అరోరా వివరించారు.