చొప్పదండి, మార్చి17: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నదని, అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 74 కోట్లతో చొప్పదండి పట్టణాన్ని మహాద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చొప్పదండి పట్టణంలో రూ.33 కోట్లతో చేపట్టబోతున్న సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్డు విస్తరణ, ఫుట్‌పాత్‌లు, సైడ్ డ్రైన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం ఆయన మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పాడికౌశిక్రెడ్డితో కలిసి తెలంగాణ చౌరస్తా వద్ద శంకుస్థాపన చేశారు. అలాగే, వ్యవసాయ మార్కెట్లో రూ.1.42 కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాక తన అమ్మమ్మ ఊరని, చొప్పదండి నియోజకవర్గానికి మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రం రాక ముందు మున్సిపల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు సరిగ్గా రాక ధర్నాలు, రాస్తారోకోలు చేసే వారని గుర్తు చేశారు. ఇంకా గతంలో సిరిసిల్లకు ఏడాదికి రూ.కోటి నిధులిస్తే సంబురాలు చేసుకునేవారని, కానీ స్వరాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ చిన్నదైనా.. పెద్దదైనా కోట్లాది నిధులు ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలకు స్థల సేకరణ చేసి త్వరలోనే నిర్మిస్తామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే జూన్ నుంచి 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, రాష్ట్రంలో 7-8 లక్షల మందికి పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా యజ్ఞాన్ని కేసీఆర్ ప్రారంభించారని, ‘మన ఊరు-మన బడి’ కింద 26 వేల సర్కారు స్కూళ్లను రూ.7,300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని, చొప్పదండి నియోజకవర్గంలో 3 వేల మందికి ఇండ్ల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అనుకున్న ప్రకారం రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో భర్తీ చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చొప్పదండి కుడిచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేయాలని, గంగాధర మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే సుంకె కోరగా, మంత్రి స్పందించారు. కుడిచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. గంగాధర ప్రజలు, పాలకవర్గం తీర్మానం చేస్తే ప్రజల కోరిక మేరకు పంచాయతీ పాలకవర్గం పూర్తయిన వెంటనే గంగాధరను మున్సిపల్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
కరీంనగర్ ఎంపీగా గెలిచి మూడేళ్లయినా మూడు రూపాయల పనిచేయని చేతగాని వ్యక్తి బండి సంజయ్ అని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గెలిచినప్పటి నుంచి చేసిన పనుల గురించి వరుసబట్టి చెబుతాడని, అదే సంజయ్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఒరగబెట్టిందేమిటో చెప్పాలని ప్రశించారు. చొప్పదండికి కనీసం మోపడంత సొప్పయినా తెచ్చిండా అని ఎద్దేవా చేశారు. ఆయన చేసింది ‘మెమ్మెమ్మె-బెబ్బెబ్బె’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఇంటికి వెళ్లి మరీ కల్యాణలక్ష్మి, రైతు బీమా చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు లేవని, మనం చేసేది రాష్ట్ర అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. ఎన్నికలోచ్చేసరికి ప్రజలను మోసం చేసేందుకు ప్రతిపక్షాల నాయకులు వస్తారని, వారిని నమ్మొద్దని సూచించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజా-భూమారెడ్డి, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య- వినయ్, సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్రావు, వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మురళీకృష్ణారెడ్డి, దూలం బాలాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, మచ్చ రమేశ్, మండల కో-కన్వీనర్ గుడిపాటి వెంకటరమణారెడ్డి, నాయకులు బందారపు అజయ్‌కుమార్, నలుమాచు రామకృష్ణ ఉన్నారు.
ఎడారిమయంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. నియోజకవర్గంలో నారాయణపూర్ రిజర్వాయర్, గాయత్రీ పంపుహౌస్ ఉన్నాయని, కాళేశ్వరం జలాలతో బంగారు పంటలు పండుతున్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న ఓటీలను త్వరగా పూర్తి చేసి నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు. చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన 30 నిముషాల్లో 33కోట్ల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. శాసనసభ, మున్సిపల్ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నమ్మి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన పట్టణ ప్రజల రుణం తీర్చుకునేలా పట్టణానికి 74 కోట్ల నిధులు మంజూరు చేయించానని చెప్పారు. ప్రజలకు తాను సేవకుడిలా పనిచేస్తానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.