న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది. యూరోతో పోలిస్తే రూపాయి బలహీనంగా ఉండటంతో వచ్చే ఏడాది తొలి నెలలోనే తమ కార్ల ధరలను పెంచాలనుకుంటున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు సంస్థ తన వాహన ధరలను 3.5-4 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. రూపాయితో పోలిస్తే యూరో విలువ 93-94 స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఇది 103 స్థాయికి పడిపోయిందని, దీంతో సంస్థపై అదనపు భారం పడుతున్నదని, దీనిని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచాల్సి వస్తున్నదన్నారు. జీఎస్టీ తగ్గింపుతో కంపెనీ తన వాహన ధరలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గించిన విషయం తెలిసిందే.