హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ-2022 ర్యాంకింగ్‌లో ఐఎస్బీ దేశంలోనే మొదటి ర్యాంకు, ఆసియాలో 4వ ర్యాంకు పొందింది. ఇక జీతాల పెంపుపరంగా ఐఎస్బీ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నది. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ)లో ప్రపంచంలో 32వ ర్యాంకును సాధించింది. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డిన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమల మాట్లాడుతూ ఐఎస్బీ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఒక సముచిత స్థానంలో ఉంటోందన్నారు. తాజాగా ఎఫ్టీ, పోయెట్స్ అండ్ క్వాంట్స్ ప్రకటించిన ర్యాంకింగ్‌లు అందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐఎస్బీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యా బోధన, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతుంటాయని తెలిపారు.