ఉక్రెయిన్‌తో శాంతి చర్చల కోసం తమ అధికారులు బెలారస్ వెళ్లారని ప్రకటించిన పుతిన్.. ఆ వెంటనే అందుకు పూర్తి విరుద్ధమైన, సంచలన ప్రకటన చేశారు. రష్యా అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఆయుధాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాటో దేశాలు తమపై ఆంక్షలతో కవ్వింపులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పుతిన్ తాజా ఆదేశంపై నాటో దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ప్రపంచదేశాలను రెచ్చగొట్టేలా ఉన్నదని ధ్వజమెత్తాయి. రష్యా అణు యుద్ధాన్ని కోరుకొంటున్నదని అమెరికా మండిపడింది. మరోవైపు, రష్యా బలగాలతో నాలుగో రోజు కూడా ఉక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడింది. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే, ఉక్రెయిన్ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది.
ఆదివారం కీవ్‌లో ఓ భవనంలో పలిగిన కిటికీ అద్దాలను ఉక్రెయిన్ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఏరుతున్న మహిళ. ఎల్లకాలం తమ దేశం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఈ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నదని నెటిజన్లు కొనియాడుతున్నారు.
కీవ్/మాస్కో, ఫిబ్రవరి 27: ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా మొదలుపెట్టిన యుద్ధ క్రీడ కొత్త మలుపు తీసుకోనున్నదా.. మరో అణు యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయా.. రష్యా న్యూక్లియర్ బలగాలు అప్రమత్తంగా ఉండాలన్న పుతిన్ ఆదేశాలు దీనికి సంకేతాలేనా..? శాంతి చర్చల కోసం తమ అధికారులు బెలారస్ వెళ్లారని ప్రకటించిన పుతిన్.. ఆ వెంటనే అందుకు పూర్తి విరుద్ధమైన, సంచలన ప్రకటన చేశారు. రష్యా అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయుధాలను సిద్ధం చేయాలని ఆర్డర్ వేశారు. పుతిన్ ఆదేశాలపై పశ్చిమ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘పుతిన్ ప్రకటన ప్రపంచదేశాలను రెచ్చగొట్టేలా ఉంది’ అని నాటో సభ్యత్వ దేశాలు వ్యాఖ్యానించాయి. ‘యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని పుతిన్ చెప్పకనే చెప్తున్నారు. ఆయన అణు యుద్ధాన్ని కోరుకొంటున్నట్టు ఉంది’ అని అమెరికా పేర్కొన్నది. పుతిన్ ఆదివారం రాత్రి రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ మిలిటరీస్ జనరల్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ‘పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. నాటో ఉన్నతాధికారులు మనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. కవ్విస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం న్యూక్లియర్ బలగాలను అప్రమత్తం చేశారు.
రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. బెలారస్ వేదికగా శాంతి చర్చలకు అంగీకారం తెలిపారు. బెలారస్లో శాంతి చర్చలు జరుపుదామన్న రష్యా విజ్ఞప్తిని జెలెన్స్కీ తొలుత తిరస్కరించిన విషయం తెలిసిందే. బెలారస్లో వివిధ స్థావరాల నుంచి రష్యా తమపై దాడులు చేస్తున్నదని, అలాంటి దేశంలో శాంతి చర్చలు జరపడం తమకు అంగీకారం కాదని ఆయన చెప్పారు. దీంతో చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయాన్ని వృథా చేస్తున్నదని రష్యా ఆరోపించింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ చర్చలకు అంగీకారం తెలిపారు.
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకొనేందుకు రష్యా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (ఎఫ్వోఏబీ) ప్రయోగించవచ్చనే వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే భూమిపై మరో హిరోషిమా, నాగసాకి వంటి మారణహోమం తప్పదని యుద్ధ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై ఎఫ్వోఏబీని వేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారని ఆ దేశ సైన్యాన్ని ఉటంకిస్తూ ది సన్ వార్తా సంస్థ తెలిపింది.
భూమిపై అత్యంత శక్తిమంతమైన బాంబుగా ఎఫ్వోఏబీని నిపుణులు అభివర్ణిస్తారు. 2007 లో ఈ బాంబును తొలిసారి పరీక్షించి చూశారు. అంతకుముందే అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (ఎంవోఏబీ) పేరుతో శక్తిమంతమైన, భారీ బాంబును తయారుచేసింది. ఈ బాంబుకు పోటీగా రష్యా తయారుచేసిందే ఎఫ్వోఏబీ. ఎంవోఏబీ కంటే ఇది 4 రెట్లు శక్తిమంతమైందని రష్యా చెప్తున్నది. ఇది 44 టన్నుల టీఎన్టీ శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. దీనిని యుద్ధ విమానాల ద్వారా గగనతలం నుంచి జారవిడుస్తారు. భూమిని తాకక ముందే గాలిలోనే బాంబు పేలుతుంది. పేలుడు జరిగిన కొన్ని క్షణాల్లోనే వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వెలువడుతుంది. ప్రమాదకరమైన రేడియో ధార్మికత వెలువడుతుంది. ఎఫ్వోఏబీ, ఎంవోఏబీల వల్ల ఆ ప్రమాదం ఉండదు.
ఉక్రెయిన్‌పై దాడికి ముందు పుతిన్ ఎలాంటి మాటలు మాట్లాడారో, వ్యూహం అనుసరించారో ఇప్పుడు అలాగే చేస్తున్నారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ అన్నారు. ‘పుతిన్ లేని సమస్యను ఉన్నట్టు చూపిస్తున్నారు. నాటో పేరు చెప్తున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో ఉక్రెయిన్‌లో నాటో బలగాలు యుద్ధంలో పాల్గొనలేదు. కానీ ఆయన నాటోను బూచిగా చూపి అణ్వాయుధాలను సిద్ధం చేయాలని చూస్తున్నారు’ అని అన్నారు. ‘పుతిన్ ప్రకటన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు’ అని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. పుతిన్ నాటోను బూచిగా చూపి యుద్ధాన్ని రెచ్చగొడుతారని కూటమి దేశాల వ్యూహకర్తలు కూడా ఆలోచించారు. తమ బలగాలను ఉక్రెయిన్‌కు పంపడం లేదని నాటో పదేపదే ప్రకటించడానికి కారణం కూడా అదే.