బంజారాహిల్స్,మార్చి 25: బస్తీల్లో తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని ఉదయ్‌నగర్, సింగాడకుంట బస్తీల్లో స్థానికుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు పెండింగ్ పనులను పరిశీలించేందుకు శుక్రవారం జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. బస్తీలోని పలు ప్రాంతాల్లో మంచినీరు రావడం లేదని, కొన్ని చోట్ల లో-ప్రెషర్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
దీంతో పాటు పలు ప్రాంతాల్లో మురుగునీరు పొంగుతోందని, రోడ్లన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త లైన్లు వేయాల్సి ఉంటుందని, నీటి సరఫరాలో లోపాలు సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి తనకు అందజేస్తే నిధులు మంజూరు చేయిస్తామని జలమండలి జీఎం హరిశంకర్‌కు సూచించారు.