హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించాలనుకుంటున్నది. బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో 18,241 ప్రాథమిక బడులున్నాయి. 3,144 ప్రాథమికోన్నత బడులను పీఎస్‌లలో విలీనం చేయనున్నారు.
ఎన్రోల్మెంట్పై ప్రభావం..
ప్రస్తుతం పూర్వప్రాథమిక విద్యాబోధన అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్నది. సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రైవేట్ బడుల్లో నర్సరీ నుంచే విద్యార్థులను చేర్చుకుంటుండంతో వారు అక్కడే కొనసాగుతున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించడం ద్వారా నర్సరీ దశలోనే విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టే వీలుంటుందన్న ఆలోచనలో కసరత్తు చేస్తున్నది.
అంగన్వాడీలుంటాయా..?
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 6.67లక్షల మంది మూడేండ్ల నుంచి ఆరేండ్ల మధ్య వయస్కులు నమోదయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ముందుకెళ్తున్నది. దీంతో అంగన్వాడీలు ఉంటాయా..? అన్న చర్చ నడుస్తున్నది. ప్రీ ప్రైమరీ బోధనకు కొత్త టీచర్లను నియమించాలని యోచిస్తుండటంతో అంగన్వాడీ టీచర్ల పరిస్థితేమిటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.